సిద్దిపేట పోలీసు కమిషనర్ బదిలీ?

by  |
సిద్దిపేట పోలీసు కమిషనర్ బదిలీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిద్దిపేటలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన పరిణామాల అనంతరం ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసిన తరహాలోనే సిద్దిపేట పోలీసు కమిషనర్‌ను కూడా బదిలీ చేస్తుందా లేక ఉప ఎన్నికలను వాయిదా వేస్తుందా అనే చర్చ మొదలైంది. అధికార పార్టీకి కలెక్టర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఇప్పుడు సిద్దిపేట వ్యవహారంలో ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఏ రోజు ఏ నిర్ణయం వెలువడుతుందో అనే ఆసక్తి నెలకొంది. సిద్దిపేటలోని పలువురి నివాసాల్లో సోమవారం జరిగిన సోదాల వ్యవహారం అనేక రకాల అనుమానాలకు తెరలేపిన నేపథ్యంలో పోలీసు కమిషనర్‌ను బదిలీ చేస్తుందా లేక ఉప ఎన్నికలను వాయిదా వేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార యంత్రాంగం అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఇప్పటికే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని రెండు రోజుల క్రితం బదిలీ చేయించింది. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ ఉత్తర్వులను వెలువరించారు. అధికార పార్టీకి కలెక్టర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం కలెక్టర్‌ను బదిలీ చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు సిద్దిపేటలో పలువురి ఇళ్ళల్లో సోదాలు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్న పోలీసులు ఆ డబ్బు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించినదని ధృవీకరించారు. కానీ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని రఘునందన్ రావు ఆరోపించారు. వారి ఇళ్ళల్లో ఎలాంటి డబ్బు దొరకకపోయినప్పటికీ పోలీసులే దొంగచాటుగా నోట్ల కట్టలను పెట్టి దొరికినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సిద్దిపేట పోలీసుల తనిఖీలు, స్వాధీనం చేసుకున్న డబ్బుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలతో కూడిన ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కుట్రలకు పాల్పడుతున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రత్యర్థి ఫార్టీలను వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు తదనంతరం ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


Next Story