మేము దానికి ఒప్పుకోం : బీజేపీకి షాకిచ్చిన హర్యానా డిప్యూటీ సీఎం

by  |
Dushyant Chautala
X

దిశ, వెబ్ డెస్క్ : బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు గానూ పలు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు తీసుకొస్తున్న ‘లవ్ జిహాద్’ చట్టంపై హర్యానా ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుశ్యంత్ చౌతాలా కమలనాథులకు షాక్ ఇచ్చారు. తాను ఆ పదానికి వ్యతిరేకమని అన్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ చట్టాన్ని తీసుకురాగా.. తాజాగా హర్యానా కూడా లవ్ జిహాద్ చట్టం తీసుకురావాలని యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో చౌహాలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చౌతాలా మాట్లాడుతూ.. ‘నేను ఆ పదంతో ఏకీభవించను. బలవంతపు మత మార్పిడిలకు వ్యతిరేకంగా మేం చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నాం. దానికి నా పూర్తి మద్దతు కూడా ఉంటుంది. కానీ ఎవరైనా వారికి నచ్చి మతం మార్చుకున్నా, ఇతర మతం వ్యక్తిని పెళ్లాడినా అందులో ఇబ్బందేం లేదు..’ అని స్పష్టం చేశారు.

కలహాల కాపురంగా సాగుతున్న హర్యానా బీజేపీ-జేజేపీల కూటమి.. కొద్దికాలంగా ఎడమొహం పెడమొహంగానే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. దేశంలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఆందోళనలకు జేజేపీ మద్దతు పలికింది. రైతుల బాధలు వినాలనీ, కొత్త వ్యవసాయ చట్టాల గురించి పునరాలోచించుకోవాలని దుశ్యంత్ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఒకానొక సమయంలో ఆయన బీజేపీకి తన మద్దతు ఉపసంహరించుకుంటారని కూడా వార్తలు వెలువడ్డాయి. ఇదిలాఉండగా.. హర్యానాలోనూ లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో దీనిని ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.


Next Story