వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం: మంత్రి హరీష్ రావు

by  |
వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం: మంత్రి హరీష్ రావు
X

దిశ, జమ్మికుంట: విశ్వకర్మ కులస్తుల వృత్తులు దెబ్బతిన్నాయని, వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలో విశ్వకర్మ మనుమయ సంఘం, జమ్మికుంటలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌లకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడారు. నిన్నటి దాకా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్.. కల్యాణ లక్ష్మి పథకాన్ని దండుగ అన్నారని, అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? అభివృద్ధి కోసం తపిస్తున్న పార్టీకి ఓటేస్తారా ఆలోచించుకోవాలని సూచించారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని, ఇక్కడున్నవి టీఆర్ఎస్, బీజేపీ మాత్రమేనని మరోసారి చెప్పారు.

బీజేపీ వాళ్లు బొట్టుబిల్లలు, గడియారాలు ఇస్తాం ఓటేయమంటున్నారు.. వీటితో మనం బతుకుతామా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు లేదని, బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదని ఆ పార్టీ తీరుపై మండిపడ్డారు. నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. 17 ఏళ్లు ఈటలకు అవకాశమిచ్చారు.. ఒక్కసారి గెల్లు శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వాలని, 17 ఏళ్లలో పూర్తి కాని పనులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story