శ్రీలంక పర్యటనకు టీమ్ ఇండియా రెడీ

66

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు టీమ్ ఇండియాను సిద్దం చేసే పనిని బీసీసీఐ ప్రారంభించింది. ఇంగ్లాండ్ వెళ్లనున్న టెస్టు జట్టులోని సభ్యులు మినహా మిగతా వారిని శ్రీలంక పర్యటనకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ ఆటగాళ్లతో మరో పటిష్టమైన టీమ్‌ను శ్రీలంక పంపనున్నారు. జూనియర్లతో కూడిన జట్టును పంపి శ్రీలంకను అవమానించలేమని.. అందుబాటులో ఉన్న సీనియర్లకే ప్రాధాన్యత ఉంటుందని బీసీసీఐ అధికారి తెలిపారు. తాజాగా శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) భారత జట్టు పర్యటన షెడ్యూల్ ప్రకటించింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్‌లో భాగంగా భారత జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉన్నది. గతంలో 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డేలు ఆడాలని ప్రతిపాదించారు. తాజాగా బీసీసీఐ కేవలం మూడు టీ20లు, 3 వన్డేలకు టూర్‌ను పరిమితం చేసింది. ఆ ప్రతిపాదన మేరకు శ్రీలంక క్రికెట్ షెడ్యూల్ విడుదల చేసింది. జులై 13, 16, 19న వన్డేలు, జులై 22, 24, 27న టీ20లు జరుగనున్నాయి. కరోనా ప్రభావం నేపథ్యంలో మ్యాచ్‌లు అన్నీ కొలంబోని సింహళీస్ క్రికెట్ క్లబ్‌లో నిర్వహించనున్నట్లు శ్రీలంక క్రికెట్ తెలిపింది. టీమ్ ఇండియా, శ్రీలంక ఆటగాళ్లు అందరూ పర్యటన మొత్తం కొలంబోలో ఏర్పాటు చేసే బయోబబుల్‌లో ఉంటారని స్పష్టం చేసింది.

కెప్టెన్ ఎవరు?

టీమ్ ఇండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ‌తో పాటు సీనియర్ జట్టు మొత్తం ఇంగ్లాండ్‌లో ఉండనున్నది. ఈ నెలాఖరున ఇంగ్లాండ్ వెళ్లే టీమ్ ఇండియా తిరిగి సెప్టెంబర్ 14 వరకు పర్యటనలోనే ఉండనున్నది. దీంతో శ్రీలంకకు వన్డే స్పెషలిస్టులను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. టీమ్ ఇండియా వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యులైన శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర చాహల్, దీపక్ చాహర్‌, పృథ్వీషాలతో పాటు సంజూ శాంసన్, రాహుల్ చాహర్, జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాతియా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను శ్రీలంక పర్యటన కోసం పరిశీలిస్తున్నది. వీరిలో సీనియర్ క్రికెటర్లు అయిన శిఖర్ ధావన్ లేదా హార్దిక్ పాండ్యాలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు సమాచారం. అయితే ఆ సమయానికి శ్రీయస్ అయ్యర్ కోలుకోక పోతేనే వీరిద్దరికీ చాన్స్ ఉంటుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలే శ్రేయస్ అయ్యర్ బుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడు పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్ సాధించి తిరిగి క్రికెట్ ఆడగలిగితే శ్రీలంక పర్యటనకు అతడే కెప్టెన్‌గా ఉండే అవకావశం ఉందని సదరు అధికారి తెలిపారు. కెప్టెన్‌గా అయ్యర్ ప్రదర్శన గత ఐపీఎల్‌లో గమనించిన బీసీసీఐ సెలెక్టర్లు అతడివైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నది.

రాహుల్ ద్రవిడ్ కోచ్..

టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు సహాయక కోచ్‌లు, ఫిజియో, ట్రైనర్లు అందరూ ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. దీంతో శ్రీలంక వెళ్లే టీమ్ ఇండియాతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ) సిబ్బందిని పంపాలని బీసీసీఐ భావిస్తున్నది. ఎన్ఏసీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ కోచ్‌గా.. అకాడమీలోని ఫిజియో, ట్రైనర్లు, సహాయక కోచ్‌లను కూడా శ్రీలంక పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీమ్ ఇండియా ‘ఏ’, అండర్ 19 జట్లకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అతడి హయాంలో జూనియర్లు అద్భుతంగా రాణించారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న చాలా మంది యువ క్రికెటర్ల రాహుల్ ద్రవిడ్ శిష్యులే. దీంతో ద్రవిడ్ టీమ్ ఇండియాతో పాటు శ్రీలంకలో పర్యటిస్తే మంచి ఫలితాలు వస్తాయని బీసీసీఐ భావిస్తున్నది. బీసీసీఐ చరిత్రలో తొలి సారి ఒక జట్టు ఒక దేశంలో పర్యటిస్తుండగానే మరో దేశానికి వేరే టీమ్‌ను పంపనున్నది. ఐపీఎల్ కారణంగా చాలా మంది యువక్రికెటర్లు బెంచ్‌లోసిద్దంగా ఉన్నారు. వీరందరూ ఇప్పుడు సీనియర్లు లేని సమయంలో భారత జట్టుకు విజయాన్ని అందించాల్సిన సమయం ఏర్పాడింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..