టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హార్ధిక్ పాండ్యా రిటైర్మెంట్..?

by  |
టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హార్ధిక్ పాండ్యా రిటైర్మెంట్..?
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడా?.. త్వరలో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా.? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా ఇది టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూసే కానుంది. వెన్ను నొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న పాండ్యా.. ఇక క్రికెట్‌కు స్వస్థి పలకనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన పలు సిరీస్‌ల్లో ఫామ్‌ కోల్పోయి పాండ్యా సతమతమవుతున్నట్టు పేర్కొంది. అతడిని వేధిస్తున్న గాయాలు కూడా ఇందుకు కారణమంటూ పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే హార్ధిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా అనధికారికంగా వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి టీ20, వన్డే, ఐపీఎల్‌లో కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.

ఈ విషయంపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ఒకవేళ పాండ్యా టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెబితే ఆ నిర్ణయం కచ్చితంగా టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. అదే నిజమైతే మేము బ్యాకప్ ఆల్‌రౌండర్ కోసం మరో క్రికెటర్‌ను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అయితే టెస్టు క్రికెట్ నుంచి పాండ్యా వీడ్కోలు తీసుకోవడం సరైన నిర్ణయమేనని కితాబు ఇచ్చాడు. గాయాలతో సతమతమవుతున్న పాండ్యాకు కొంత ఉమశమనం కలుగుతుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా విజయ్ హజారే ట్రోఫీకి సైతం తాను అందుబాటులో ఉండటం లేదంటూ హార్ధిక్ పాండ్యా క్లారిటీ ఇచ్చాడు. విజయ్ హజారే టోర్నిలో బరోడా టీంలో పాండ్యా కీ ప్లేయర్. అయితే.. పూర్తిస్థాయి బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం కోసమే హార్దిక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బరోడా క్రికెట్‌ సంఘం (బీసీఏ)కు తెలిపాడు. అయితే.. హార్దిక్‌కు ఎలాంటి గాయమైందో బీసీఏకు కూడా తెలియదని బీసీఏ అధికారి తెలిపాడు.

సౌతాఫ్రికా పర్యటనలో భారత్ టార్గెట్ చేయాల్సింది వారినే : DK


Next Story