ఆపదొస్తే "సెలవు" లేదు.. కొలువుకొస్తే.. "డ్యూటీ" లేదు

by  |
ఆపదొస్తే సెలవు లేదు.. కొలువుకొస్తే.. డ్యూటీ లేదు
X

దిశ,పరకాల: హక్కుల కోసం పోరాడిన పాపానికి కార్మిక సంఘాలను ఎత్తివేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఆర్టీసీ డిపోలో ఎలాంటి యూనియన్లు అజమాయిషీలో లేవు. హక్కులు, యూనియన్లు, సంఘాలు అంటూ మాట్లాడితే అధికారుల దృష్టిలో పడాల్సి ఉంటుంది. అంతే కాక వేధింపులు. ఏదో సాకుతో మెమో జారీ చేయడం, ఇంక్రిమెంట్లలో కోత విధించడం. చెప్పుకోను యూనియన్లు లేవు, అడుగుదామంటే కొలువు దక్కదు. ఇది ఆసరాగా తీసుకున్నారు పరకాల ఆర్టీసీ డిపోలోని అధికారిని ఒక్కరు. ఆ అధికారిని వేధింపులు తట్టుకోలేక, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అడకత్తెరలో పోకచెక్క సందమైంది పరకాల ఆర్టీసీ డిపో కార్మికుల పరిస్థితి.

ఏదైనా ఆపద వచ్చి లీవ్ కావాలని కోరితే లీవ్ దొరకదు. ఇంట్లో సావుందనో, నోముందనో, కుటుంబంలో ఆపదొచిందంటేనో లీవ్ ఇవ్వక పోవడమే కాదు, స్వయానా కార్మికుడికి ప్రమాదమెదురైన, అనారోగ్యంతో మంచం పట్టిన ఏదన్న వాహనంలో డిపోకు తీసుకొచ్చి చూయిస్తే గాని ఆ అధికారిని నమ్మరు. అలా తీసుకు వచ్చిన సందర్భాల్లో సైతం లీవ్ మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు కార్మికులు పత్రిక దృష్టికి తీసుకరావడం గమనార్హం.

డ్యూటీ అయినా చేసుకుందామని, డిపో‌కి వస్తే సర్వీసుల కొరతతో పొద్దంతా వేచిచూడాలి తీరా సర్వీసు దొరకకపోతే లీవ్ తీసుకొని వెళ్ళి పోవాలి. పొద్దంతా కూర్చున్నాం కదా ఆన్ డ్యూటీ‌గా పరిగణించండి అంటే కుదరదు అంటారు. అంతేకాకుండా కండక్టర్లు డ్రైవర్లు‌లకు వేరు వేరు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి కే ఎమ్ పీ ఎల్, ఆక్యుపెన్సీలను ట్రిప్పు ట్రిప్పుకు ప్రకటించాలంటూ కోరుతుండడంతో ఆక్యుపెన్సీ తగ్గిన కార్మికులు ఆత్మన్యూనతా భావానికి గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో డ్రైవర్ తనే టికెట్ ఇష్యూ చేస్తూ సుమారు ఆరు వందల నుంచి 700 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేయాల్సి వస్తుందని రిలీవ్ డ్రైవర్ కేటాయించకుండా నడిపిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా కండక్టర్‌లకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీ దిగి పోయేలా చర్యలు తీసుకోవాలని స్వయానా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాత్రి 11 గంటల వరకు డ్యూటీలు వేస్తూ మహిళా కార్మికులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. పరకాల ఆర్టీసీ డిపోలో ఆ అధికారిని అంతా తానై వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుండటంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే ఆత్మహత్య శరణ్యంలా అనిపిస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు కార్మికులు దిశ పత్రిక దృష్టికి తీసుకురావడం గమనార్హం.


Next Story

Most Viewed