కామారెడ్డి వైద్యాధికారి వేధింపులు.. సొమ్మసిల్లి పడిపోయిన డీపీఓ

by  |
Kamareddy DMHO
X

దిశ, కామారెడ్డి: జిల్లా వైద్యశాఖలో పని చేస్తోన్న సిబ్బందికి పనిభారం తలకుమించినదిగా మారుతోంది. కరోనా పుణ్యమా అని వైద్య సిబ్బందికి రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిభారం మీద పడుతోంది. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ టార్గెట్స్ విధించడం‌తో రెగ్యులర్ విధులు సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా వైద్యాధికారిగా కల్పన కాంటే ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటినుంచి కిందిస్థాయి సిబ్బందికి అధికంగా పనులు అప్పజెప్పుతున్నారన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత అక్టోబర్ నెలలో బతుకమ్మ పండగకు ప్రభుత్వం సెలవులు ఇచ్చినా, వ్యాక్సినేషన్ టార్గెట్ వల్ల పండుగ కూడా జరుపుకోలేదని వాపోయారు. తాజాగా.. జిల్లా వైద్యశాఖలో డీపీఓగా పని చేస్తోన్న పద్మజ పనిభారం ఎక్కువై సొమ్మసిల్లి పడిపోయింది. ప్రస్తుతం ఆమె జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతోంది.

దీంతో జిల్లా వైద్యాధికారి వేధింపులు ఎక్కువ అయ్యాయని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌కు వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. అందులో తమను వైద్యాధికారి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో వివరించారు. బతుకమ్మ సంబురాలకు ప్రభుత్వం ప్రతిరోజూ నిర్ణీత సమయం కేటాయించినా, తమను సంబురాల్లో పాల్గొనకుండా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యవసర సమయంలో సైతం తమకు సెలవులు ఇవ్వడం లేదని ఆరోపించారు. సాయంత్రం 5:30 తర్వాత కలెక్టరేట్ నుంచి నిజామాబాద్ వెళ్ళడానికి కలెక్టర్ చొరవతో ప్రత్యేక బస్ వేయించారని, ఆ సమయంలో తమను ఆఫీసు నుంచి వెళ్ళనీయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యశాఖలో పని చేస్తోన్న ప్రతీ ఒక్కరిపై పనిభారం మోపుతూ వేధింపులకు గురి చేస్తోందని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

Kamareddy DMHO


Next Story

Most Viewed