కోల్పోయిన క్షణాలు వేధిస్తున్నాయా?.. ఆనందాన్ని ఆస్వాదించండిలా

by Disha Web Desk 10 |
కోల్పోయిన క్షణాలు వేధిస్తున్నాయా?.. ఆనందాన్ని ఆస్వాదించండిలా
X

దిశ, ఫీచర్స్: సమయం లేకనో, అవకాశం రాకనో మీరు జీవితంలో కొన్ని ముఖ్యమైన క్షణాలను, సంఘటనలనో, సన్నివేశాలనో కోల్పోవచ్చు. ఆ తాలూకు ఆలోచనలు అప్పుడప్పుడూ మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుండవచ్చు. ఈ పరిస్థితి కొందరిలో తాము ఏదో కోల్పోయామనే నెగెటివ్ ఆలోచనలకు దారితీస్తుంది. మరికొందరిలో తీవ్ర నిరాశకు, డిప్రెషన్‌కు కారణం అవుతుంది. అయితే దీనిని ఎదుర్కోవడానికి చక్కటి పరిష్కారం ఉందంటున్నారు మానసిక నిపుణులు. అదేంటంటే.. ప్రశాంతమైన వాతావరణంలో లేదా ప్రకృతి సౌంర్యాన్ని ఆస్వాదిస్తూ మీరు కోల్పోయిన పరిస్థితులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని అనుభూతి చెందడం. ఇలా చేయడం ద్వారా మీరు ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సైకాలజీ ప్రొఫెసర్ డాచర్ కెల్ట్‌నర్ (Dacher Keltner) అంటున్నారు.

ఆలోచనల ఎఫెక్ట్

కొన్నిసార్లు మనం పనుల్లో బిజీగా ఉండి ఆ క్షణంలో పొందాల్సిన సంతోషాన్ని కోల్పోతుంటాం. ఉదాహరణకు సీరియస్‌గా చదువుతున్నప్పుడు పిల్లల సంభాషణ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా అప్పుడు మాట్లాడలేరు. ఆరుబయటకు వెళ్లి పరిసరాలను చూడాలనుకున్నప్పటికీ బిజీ షెడ్యూల్ వల్ల సాధ్యం కాకపోవచ్చు. అంటే.. మీరు ఆనందాన్ని పొందగలిగేవి లేదా మీకు ఆసక్తిగా అనిపించే క్షణాలను ఆ సందర్భంలో కోల్పోతారన్నమాట. ఆ తాలూకు ఆలోచనలు మీలో మిగిలిపోతే, పదే పదే మంచి అవకాశాన్ని కోల్పోతున్నామని భావిస్తుంటే.. అతి ఆలోచనలకు, నెగెటివ్ ఫీలింగ్స్‌కు దారితీస్తాయి. మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇటువంటి ప్రతికూల ఆలోచనలను నివారించుకోవాలి.

ఇలా చేయండి

మీరు ఆయా సందర్భంలో కోల్పోయామని భావించే సంఘటనలను, ఫీలింగ్స్‌ను నోట్ చేసి పెట్టుకోండి. అవి ఆరుబయట తిరగడం కావచ్చు. పిల్లలతో సంభాషించడం కావచ్చు. కళాత్మక కార్యక్రమాలు వీక్షించడం కావచ్చు. మీరు మిస్ అయిన అత్యంత ముఖ్యమైన వ్యక్తి కావచ్చు. ఇలా చేసింతర్వాత మీకు సమయం దొరికినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో, ఆరుబయట ప్రకృతి సౌందర్యాల మధ్య కూర్చొని వాటిని ఊహించుకోండి. మీరు పిల్లలతో మాట్లాడటం కోల్పోయి ఉంటే.. వారి సంభాషణను, మాటలను గుర్తు తెచ్చుకోండి. మీరు మిస్ అయిన వారు మీకు ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటే.. సదరు వ్యక్తితో మీకున్న అనుబంధాన్ని, మీతో మాట్లాడుతున్నట్లు పాజిటివ్ కోణంలో అనుభూతి చెందండి. మీరు మంచి కళాత్మక సన్ని వేశాన్ని కోల్పోయి ఉంటే.. దానిని కూడా పాజిటివ్ కోణంలో ఊహించుకొని అనుభూతి చెందండి. ఇలా చేయడంవల్ల మీరు కోల్పోయిన మధురక్షణాల తాలూకు నెగెటివ్ ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు, సానుకూల దృక్పథం ఏర్పడుతాయని, మీలోని మానసిక ఒత్తిడి దూరమై, ఆనందాన్ని ఆస్వాదించ గలుగుతారని మానసిక నిపుణులు చెప్తున్నారు.

Also Read..

జుట్టు విరబోసుకుంటే నిజంగానే దెయ్యాలు పడుతాయా?


Next Story