నష్టాల్లో పవర్ లూమ్స్… కష్టాల్లో నేతన్న..!!

by  |
నష్టాల్లో పవర్ లూమ్స్… కష్టాల్లో నేతన్న..!!
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసలే చేనేత కార్మికులు నష్టాల్లో ఉండగా, ప్రస్తుతం కరోనా మరింత ప్రమాదంలోకి తోసింది. పవర్ లూమ్స్ పై ఆధారపడిన నేత కార్మికుల పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’అన్న చందంగా తయారైంది. అప్పలు చేసి నేసిన వస్త్రాలకు గిరాకీ లేక పోవడంతో పవర్ లూమ్స్‌లోనే లక్షల రూపాయల విలువైన వస్త్రాలు కుప్పలుగా వేశారు.. ఓవైపు అమ్ముకోలేక మరోవైపు.. పవర్ లూమ్స్ నడుపుకోలేక బతుకుబండిని నడపలేక మనోవేదనకు గురవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు… ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

తెలంగాణలో సగటున నెలకు 40-50 కోట్ల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో సగం పట్టు చీరలే. ఇప్పటి వరకూ నేత కార్మికులు తమ దగ్గర ముడి సరకు ఉన్నంత వరకూ పనిచేశారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చే ముడి సరకు లాక్ డౌన్ వల్ల నిలిచిపోయింది. దీంతో పని ఆపేస్తున్నారు. ఉత్పత్తి, కొనుగోలు లేకపోతే వీరికి రోజు గడవడమే కష్టంగా మారింది. దీనికి తోడు చాలా మంది నేత కార్మికులకు సొంతంగా ముడి సరకు కొని, నేసిన వాటిని షాపులకు అమ్మే అంత పెట్టుబడి కానీ, మార్కెటింగ్ నైపుణ్యం కానీ ఉండదు. దీంతో వ్యాపారులు వారికి ముడిసరకు ఇచ్చి, బట్ట నేసిన తరువాత సొమ్ము చెల్లించి తీసుకెళ్తారు. దీంతో వీరందరికీ కరోనా సంకటంగా మారింది. వ్యాపారం సాగడం లేదు కాబట్టి, పెట్టుబడిగా ముడిసరకు ఇచ్చిన వారి నుంచి డబ్బు అందడంలేదు.ఇక మరికొందరు మాత్రం సొంతంగా నేసి, షాపులకు ఇస్తారు. వారికి మరింత ఇబ్బంది. వారంతా చాలా చిన్న వ్యాపారులకు కావడంతో, ఇన్ని రోజులు సరకు ఆగిపోతే తట్టుకునే శక్తి వారికి లేదు.

రాష్ట్రంలో 80వేల పవర్ లూమ్స్

తెలంగాణలోని సిరిసిల్ల, భువనగిరి, నల్లగొండ, వరంగల్, జనగాం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో 80 వేల పవర్ లూమ్స్ ఉండగా, లక్షా50 వేల మంది పనిచేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఆ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ తరుణంలో గతేడాది కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం, ఈ ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో నైట్ కర్ప్యూ విధించింది. దీనికి తోడు మార్కెట్ సదుపాయం లేకపోవడంతో నేసిన వస్త్రాలు అమ్ముడు కాకపోవడంతో చేసేదేమీలేక స్వచ్ఛందంగా మూసివేస్తున్నారని పవర్ లూమ్ నిర్వహకులు తెలిపారు.

శుభకార్యాలయాలు వాయిదాతో…

కరోనాతో అన్ని రంగాలతో పాటు పవర్ లూమ్ కుదేలైంది. మాల్స్, బట్టల దుకాణాలు సైతం నైట్ కర్ప్యూతో సాయంత్రం 8 గంటలకు బంద్ అవుతున్నాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, శుభకార్యాలయాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో చీరల ఎగుమతి నిలువడంతో చేనేతపై తీవ్రంగా ఎఫెక్ట్ ​పడుతుంది. అన్ని రంగాలు కొంతమేర గాడిన పడుతున్నా.. చేనేత అమ్మకాలు మాత్రం పెరగలేదు. కరోనాకు ముందటి టైంతో పోలిస్తే ఇప్పుడు సగం మేర కూడా అమ్మకాలు జరుగడం లేదు. రాష్ట్ర చేనేత సహకార సంస్థ లెక్కల ప్రకారం 2019–20 ఫైనాన్షియల్​ ఇయర్​తో పోలిస్తే 2020–21 ఏడాదిలో విక్రయాలు
నాలుగున్నర కోట్ల యూనిట్ల మేర తగ్గాయి. కరీంనగర్‌, వరంగల్‌, సికింద్రాబాద్‌ డివిజన్లలో 2019–20లో ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 11.20 కోట్ల మేరకు అమ్మకాలు జరగ్గా.. 2020–21లో అదే టైంకి రూ.6.8 కోట్ల మేర మాత్రమే సేల్స్‌ జరిగాయి. ప్రస్తుతం కోట్ల విలువైన వస్త్రాలు పవర్ లూమ్స్ లోనే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలో మూసివేత

కరోనా నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పవర్ లూమ్ యజమానులు 15 రోజుల పాటు మూసి వేత నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు మూసివేస్తామని పవర్ లూమ్స్ యజమానుల యూనియన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జెల్లా భిక్షం తెలిపారు. నేసిన వస్త్రాల కొనుగోలు లేకపోవడం, దీనికితోడు కార్మికులు, యజమానులు కరోనా బారిన పడకుండా స్వచ్చందంగా మూసివేత నిర్ణయం తీసుకున్నారు. దీంతో పవర్ లూమ్ వాడలన్ని కార్మికులు లేక నిర్మాణుష్యంగా మారాయి.

పవర్ లూమ్స్ గట్టేక్కాలంటే…

50శాతం సబ్సిడీపై యారం, రసాయనాలు పంపిణీ చేయాలని పవర్ లూమ్స్ నిర్వహకులు కోరుతున్నారు. దీనికితో తోడు వర్కర్ టు ఓనర్ పథకాన్ని సిరిసిల్లకు పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని,ఆరోగ్య భీమా, రూ.లక్షల ఇన్సూరెన్స్, విద్యుత్ బిల్లుల మాఫీ, పవర్ లూమ్స్ సమీపంలోనే యారం డిపోలు ఏర్పాటు, సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులకు దుస్తుల కాంట్రాక్టు, కేసీఆర్ కిట్టులో రెగ్జిన్ కు బదులుగా టవల్, బెడ్ షిట్స్ చేనేత వస్త్రాలు ఉండేలా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో చీరెలు, దోవతులు అందజేసేలా చర్యలు, ప్రభుత్వరంగ సంస్థల్లో, గురుకులాల్లో బెడ్ షిట్స్, టవల్స్, కర్టెన్లు, టేబుల్ మ్యాట్ తో పాటు ఇతర ప్రైవేటు రంగాల్లో కూడా చేనేత వస్త్రాలు వాడేలా చర్యలు తీసుకుంటే కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు చేనేత పరిశ్రమ గట్టెక్కుతుందని చేనేత పరిశ్రమల నిర్వహకులు, యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.


Next Story

Most Viewed