పనులు లేక గుడుంబా తయారు చేస్తున్రు: అధికారులు

by  |

దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ కారణంగా కూలీ పనులు లేక చాలామంది ప్రత్యామ్నాయం వెతుకుతూ ఈజీగా మనీ సంపాదించొచ్చని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇతర జిల్లాలకు వలస వెళ్ళిన చాలామంది తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ తరుణంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వీరంతా కూడా సులువుగా డబ్బులు సంపాదించుకునేందుకు గుడుంబా తయారీలో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గుడుంబా తయారీ జోరుగా సాగుతోన్నది. ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో మాత్రం అరికట్టడంలో విఫలం అవుతున్నారు. చివరకు గుడుంబా తయారీ దారులు ఎక్సైజ్ శాఖ అధికారులపై కూడా దాడులు చేసేందుకు వెనుకంజ వేయడం లేదంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లీటర్ సారాను రూ.500 నుంచి రూ.750 లకు అమ్ముతున్నారు. Gudumba

నియంత్రించలేకపోతున్నారు..

ఈ నేపథ్యంలో గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, స్పటిక, తదితర వస్తువులను అధికారులు దాడులు నిర్వహించి భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ తరువాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 445 కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంలో 490 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 2254 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు గ్రామాలలో దాడులు నిర్వహించారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండంగా 26 వేల కిలోల బెల్లం పానకం పట్టుబడింది. ఈ సందర్భంలో గుడుంబా, వాటికి కావాల్సిన సరుకులను సరఫరా చేసేందుకు ఉపయోగించిన 152 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థాయిలో అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నా కూడా గుడుంబా తయారీని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ముఖ్యంగా పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి వచ్చినవారే అధికంగా ఈ గుడుంబాను తయారు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

Tags: gudumba, excise officers, vehicles, black jaggery, crystal, police

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story