- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రెండింగ్: టెర్రస్ మీద మినీ ఫారెస్ట్
<p>దిశ, ఫీచర్స్ : ‘అసూయ పుట్టించే అందాన్ని పోగేసుకున్న గులాబీలు.. చూస్తేనే కోసుకుని తినాలనిపించే జామకాయలు, ముచ్చటగొలిపే మామిడి చెట్లు, ఆకర్షించే ఆరెంజ్ పండ్లు, కనువిందు చేసే క్యారెట్లు, నోరూరించే చింతకాయలు’.. ఎటు చూసినా విరగబూసిన పూలతో ‘పెరటి తోటలు’ భలే అందంగా, ఆహ్లాదంగా ఉండేవి. వీటితో పెనవేసుకున్న జ్ఞాపకాలు, అనుబంధాలను మాటల్లో చెప్పడం కష్టమే! అయితే బాల్యంలో తియ్యని ఫలాలను, మరపురాని గుర్తులను పంచిన ఈ తోటలు.. మారుతున్న కాలంలో ‘మిద్దె తోటలు’గా రూపు దాల్చుకుంటున్నాయి. […]</p>

దిశ, ఫీచర్స్ : ‘అసూయ పుట్టించే అందాన్ని పోగేసుకున్న గులాబీలు.. చూస్తేనే కోసుకుని తినాలనిపించే జామకాయలు, ముచ్చటగొలిపే మామిడి చెట్లు, ఆకర్షించే ఆరెంజ్ పండ్లు, కనువిందు చేసే క్యారెట్లు, నోరూరించే చింతకాయలు’.. ఎటు చూసినా విరగబూసిన పూలతో ‘పెరటి తోటలు’ భలే అందంగా, ఆహ్లాదంగా ఉండేవి. వీటితో పెనవేసుకున్న జ్ఞాపకాలు, అనుబంధాలను మాటల్లో చెప్పడం కష్టమే! అయితే బాల్యంలో తియ్యని ఫలాలను, మరపురాని గుర్తులను పంచిన ఈ తోటలు.. మారుతున్న కాలంలో ‘మిద్దె తోటలు’గా రూపు దాల్చుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ‘టెర్రస్ గార్డెనింగ్’కు నగరాల్లోనూ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ రక్షకులు తమ మిద్దెల్ని అందమైన చెట్లకు నిలయంగా, పక్షులకు ఆవాసాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు రిటైర్డ్ ఐటీ ఉద్యోగి నటరాజ ఉపాధ్యాయ.. తన ఇంటిపై ఏకంగా ఓ మినీ అరణ్యాన్నే సృష్టించి, ఆహ్లాదభరితమైన వాతావరణంలో హ్యాపీగా జీవిస్తున్నాడు. ఇక కోల్‌కతాకు చెందిన రిటైర్డ్ ఐ సర్జన్ డాక్టర్ కాళి ప్రసాద్ సాహా.. తమ ఇంటి మిద్దెను 250 రకాల పండ్ల చెట్లకు కేరాఫ్‌గా మార్చాడు. మరి మనం కూడా ఒకసారి ఈ కాంక్రీట్ ఫారెస్ట్ నుంచి మైక్రో ఫ్రూట్ గార్డెన్ మీదుగా మినీ జంగల్‌లోకి ప్రయాణిద్దాం పదండి..
ఒకప్పుడు బెంగళూరును ‘గ్రీన్ సిటీ’గా పిలిచేవాళ్లు. కానీ ప్రస్తుతం అది ‘కాంక్రీట్ జంగల్’గా అభివృద్ధి చెందింది. డిఫారెస్టేషన్ కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. విరివిగా మొక్కలు పెంచితే తప్ప ఈ వేడికి అడ్డుకట్ట వేయలేమని పర్యావరణ ప్రేమికుడైన నటరాజ ఉపాధ్యాయ భావించాడు. చిన్నతనం నుంచే మొక్కలను పెంచడం అలవాటుగా చేసుకున్న అతడు, ఐటీ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత టెర్రస్‌పై మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఇందుకోసం బియ్యం సంచులు, పాడైన కంటైనర్లు, రీసైకిల్ చేసిన 55లీటర్ల డ్రమ్స్‌ను వినియోగించాడు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని తమ మిద్దెపై తొలిగా కూరగాయలు, ఔషధ మొక్కలను పెంచడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో జామ, మామిడి, సపోట, దానిమ్మ, మునగ, వెదురు, చింతతో సహా దాదాపు 1700 రకాల చెట్లను పెంచాడు. విత్తుగా మొదలైన అతడి ఆకాంక్ష.. మిద్దెపై మినీ అరణ్యాన్నే సృష్టించింది. ప్రకృతికి ఆలవాలమైన ఆ టెర్రస్ గార్డెన్‌లో దాదాపు 50 రకాల సీతాకోకచిలుకలు, పన్నెండు జాతులకు పైగా పక్షులు ఆవాసాన్ని ఏర్పరుచుకున్నాయి.
జీవవైవిధ్యానికి తోడ్పడుతున్న మా తోటలోని మొక్కలకు ఎప్పుడూ పురుగుమందుల అవసరం రాలేదు. మా గార్డెన్‌ను ‘అర్బన్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్’గా పిలుచుకుంటాను. ఎందుకంటే.. ఈ తోట ఎప్పటికీ తన అందాన్ని కోల్పోదు. ప్రతి రుతువులోనూ ఆకుపచ్చ వర్ణంలో భూమికి గొడుగు పడుతుంది. టెర్రస్ మీదకు అల్లుకునే లతలు సహజమైన పరదాను తలపిస్తాయి. ఈ తోట వల్ల బయటితో పోల్చితే మా ఇంటి చుట్టుపక్కల 2-3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తక్కువగా ఉంటుంది. అంతేకాదు వేసవిలో ఫ్యాన్, ఏసీ అవసరం లేకుండానే గడపొచ్చు. చెట్ల బరువు వల్ల 1987లో నిర్మించిన మా ఇంటి పిల్లర్స్ కూలిపోయే ప్రమాదముంది. అందుకే స్తంభాలపై భారం పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. ఇక నా అనుభవాల ద్వారా జీవవైవిధ్యానికి సంబంధించిన వివిధ అంశాలను యూట్యూబ్ చానల్ ద్వారా వివరిస్తున్నాను. చిన్న విస్తీర్ణంలో అర్బన్ జంగల్ సృష్టించడం సాధ్యమని చూపించాలనుకుంటున్నాను. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, దీన్ని ఎవరైనా చేయగలరు. ముఖ్యంగా వాతావరణ మార్పుల ముప్పును నిరోధించాలంటే.. పట్టణ ప్రదేశాలను గ్రీన్ జోన్లుగా మార్చడం అత్యవసరం. ఇది వ్యక్తిగతం కాదు.. ఇలాంటి పనులు సమాజానికి ఎంతో సాయం చేస్తాయి.– నటరాజ ఉపాధ్యాయ
మొక్కలు పెంచాలనే కోరిక తన మనసులో చాలా కాలం నుంచే ఉన్నా, హెక్టిక్ వర్క్ వల్ల కుదరలేదు. ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత డాక్టర్ కాళీ ప్రసాద్ సాహా.. తమ టెర్రస్‌పై మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. ప్రస్తుతం 2200 చదరపు అడుగుల టెర్రస్ తోటలో ద్రాక్ష, జామ, చెర్రీస్, లిచీ, స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్వీట్ లైమ్, నారింజ, జాక్ ఫ్రూట్, మామిడి పండ్లతో సహా వివిధ రకాల కూరగాయలు (క్యాప్సికమ్, వంకాయ, టమాట), ఔషధ మొక్కలతో మొత్తం 250కి పైగా రకాలను పెంచుతున్నాడు. ప్రతి మొక్కను కూడా చిన్న చిన్న కుండీల్లోనే పెంచడం సాహా ప్రత్యేకత. అతను పెంచే తోటల్లో అరుదైన స్వీట్ టామరిండ్స్, బ్లూ మ్యాంగో, రెడ్ గువాస్, రెడ్ బటాబి లెబస్ మొక్కలున్నాయి. పూల మొక్కల్లో కూడా రేర్ ప్లాంట్స్ పెంచుతున్నాడు సాహా. అంతేకాదు డాక్టర్ సాహా పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ఫ్లవర్ షోస్, కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేస్తూనే.. మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాడు.
తోటపని కోసం చాలా కష్టపడాలి కానీ అదెంతో హాయిగా ఉంటుంది. గార్డెనింగ్‌పై ఇష్టం చూపకపోతే చాలా భారంగా ఉంటుంది. చుట్టుపక్కల వారితో పాటు తోటి వైద్యులు కూడా నా తోటను సందర్శించడానికి వస్తుంటారు. గార్డెన్‌లోని మొక్కలను చూసి వాళ్లెంతో ఆహ్లాదం పొందుతారు. కుండీల్లో పెరుగుతున్న చెర్రీ, లిచీ, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీ, మోసంబి, నారింజ, అనేక రకాల మామిడి పండ్లను చూసి ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం చిన్న కుండీల్లోనే జాక్‌ఫ్రూట్ పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఎప్పుడూ అరుదైన మొక్కల కోసం వెతుకుతుంటాను. నా కలెక్షన్స్‌లో భిన్నమైన, రేర్ ప్లాంట్స్ చూడొచ్చు. మీరు కాలో జామ్ గురించి వినే ఉంటారు, కానీ షాదా జామ్ రుచి కోసం మీరు తప్పకుండా మా ఇంటిని సందర్శించాలి. తేజ్ పత్తా ట్రీ, గంధరాజ్ ప్లాంట్ కూడా పెంచుతున్నాను. లాక్‌డౌన్ సమయంలో, కొవిడ్ భయాల్లో ఈ మొక్కలే నా ఒత్తిడిని తగ్గించాయి. ఉదయాన్నే లేచి మొక్కలతోనే చాలా సమయం గడుపుతాను. నిజంగా మనసుతో వింటే.. అవి మనతో ఎన్నో కబుర్లు చెబుతాయి.– డాక్టర్ కాళి ప్రసాద్






