- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడప జిల్లాలో విషాదం: నీటి గుంతలో అక్కాచెల్లెళ్ల మృతి
కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందడం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది. ..

దిశ, కడప: కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందడం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది. దుంపలగట్టు గ్రామానికి చెందిన సంజన (18), అర్చన (14) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పందులకు నీళ్లు తాపడం కోసం పొలం పరిసరాల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న లోతైన నీటి గుంతలో ఒకరు పడిపోగా, వారిని రక్షించే ప్రయత్నంలో మరొకరు కూడా నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలోనే శ్వాస ఆడక ప్రాణాలు విడిచారు.
గ్రామంలో విషాదఛాయలు
బాలికలు ఎంతకీ ఇంటికి రాకపోవడం, విషయం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. నీటి గుంతలో గాలించి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన, కళ్లముందే తిరుగాడిన ఇద్దరు ఆడపిల్లలు ఒకేసారి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామం మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఘటనపై సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.






