బీజేపీలో గ్రూపు రాజకీయాలు.. ఇతర పార్టీల వైపు మొగ్గు

322
bjp party

దిశ, బాల్కొండ: పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఏళ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, కొంతమంది నాయకులు కొత్త వారికి ప్రాధాన్యతనిచ్చి, ప్రోత్సహిస్తుండడంతో బాల్కొండ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయి. ఆర్ఎస్ఎస్ మూలాలు, బీజేపీ సిద్ధాంతాలతో జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వర్తించిన వారు అందులో ఇముడలేని పరిస్థితి నెలకొంది. పార్టీలోని జిల్లా స్థాయి నాయకులు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చాలా మంది నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలుగా పార్టీని, సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న వారిని కాదని, కొత్త వారికి ప్రయారిటీ ఇస్తుండడం వారికి ఏమాత్రం రుచించడం లేదు. జిల్లాకు చెందిన బీజేపీ ప్రజాప్రతినిధి సీనియర్లను పక్కన పెట్టి కొత్త వారితో… మీరే భవిష్యత్​లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారన్నట్టుగా వారి చేత గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని సమాచారం.

యువనేత తీరుపై అసంతృప్తి.!

ఆర్థిక బలం, పలుకుబడితో పదవులు అనుభవించే వారు కొందరైతే… సొంత కష్టంతో కార్యకర్త స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎదిగే వారు మరికొందరు. బాల్కొండ నియోజక వర్గానికి చెందిన ఆ జిల్లా స్థాయి బీజేపీ నేత రెండో రకానికి చెందిన వాడు. ఆయన పార్టీలో ఉంటున్నది పదవుల కోసమో, పలుకుబడి కోసమో కాదని సొంత పార్టీ నేతలతోపాటు ఇతర పార్టీ నేతలు కూడా చెబుతుంటారు. ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ సిద్ధాంతాలు, పూర్తి హిందూ భావజాలంతో ఇన్నేండ్లు పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీని వీడకుండా, పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశారని కార్యకర్తలు చెబుతుంటారు. కానీ, ఇప్పుడు అదే నేత అధికార పార్టీ వైపు చూస్తున్నాడనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు, తదితర పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల పార్టీలోకి చేరిన ఓ పచ్చ పార్టీ నేతను బీజేపీ జిల్లా నాయకులు ప్రోత్సహిస్తుండడం, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, కార్యక్రమాలు చేపట్టడంతో అతను ఇటీవల కాలంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన నేత సదరు జిల్లా స్థాయి నేతతోపాటు కేడర్​కు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇదే సమయంలో సదరు నేత గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. జిల్లా నేతగా ఓ వెలుగు వెలిగి, బాల్కొండ లో కేడర్​తయారు చేసిన నేతను కాదని, ఇతరులకు పార్టీ టికెట్ తోపాటు ఇన్​చార్జి పదవులు ఇస్తే పార్టీ మారడం ఖాయమని కమలం పార్టీ నేతలే పేర్కొంటుండడం గమనార్హం.

కేడర్​ అంతా ఆయన బాటలోనే..

అధికారం లేకపోయినా ఎన్నో ఏండ్లుగా పార్టీ కి విధేయులుగా ఉన్న మండల స్థాయి నేతలు కూడా గ్రూపురాజకీయాల వల్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. జిల్లా స్థాయి నేత, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు.. పార్టీలో ముందునుంచీ ఉన్న మమ్మల్ని పట్టించుకోవడంలేదని, ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని లోకల్​కేడర్​అంతా బహిరంగంగానే వాపోతున్నారు. అందుకే ఇటీవల పార్టీ చేపట్టిన సభ్యత్వం కానీ, ప్రజా ఆందోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. తామంతా ఆ నేత వెంటనే ఉంటామని, పార్టీ మారితే తాము కూడా వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. బాల్కొండలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మూడో స్థానంలో, పార్లమెంట్ ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్న ఆ నేత పార్టీ మారితే భారతీయ జనతా పార్టీకి జిల్లాలో పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఏళ్ల తరబడి కష్టపడి ప్రతిఫలం ఆశించకుండా పనిచేసిన నేతలు కమలాన్ని వీడితే పెద్ద ఎత్తున నష్టం కలగడం ఖాయమని తెలుస్తోంది. పార్టీ కోసం తామంతా అహర్నిషలూ పాటు పడితే గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీ మారేలా పరిస్థితులు కల్పిస్తున్నారని కమలం కేడర్​ వాపోతోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..