రెండు పార్టీలకూ గెలుపు ప్రతిష్ఠాత్మకం

by Vadlamudi Anukaran |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని ప్రాధాన్యతను ఈసారి సంతరించుకున్నాయి. బరిలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ తదితర ప్రధాన పార్టీలతో పాటు టీజేఎస్, వామపక్షాలు, జనసేన లాంటివన్నీ ఉన్నాయి. ఇన్ని పార్టీల నడుమ జరుగుతున్న ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ ఉన్నా ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎలాగూ టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నందున ఆ రెండూ ఒకటే అనే సాధారణ [&hellip;]</p>

రెండు పార్టీలకూ గెలుపు ప్రతిష్ఠాత్మకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని ప్రాధాన్యతను ఈసారి సంతరించుకున్నాయి. బరిలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ తదితర ప్రధాన పార్టీలతో పాటు టీజేఎస్, వామపక్షాలు, జనసేన లాంటివన్నీ ఉన్నాయి. ఇన్ని పార్టీల నడుమ జరుగుతున్న ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ ఉన్నా ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎలాగూ టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నందున ఆ రెండూ ఒకటే అనే సాధారణ అభిప్రాయం ఉండనే ఉంది. అటు టీఆర్ఎస్‌గానీ, మజ్లిస్‌గానీ బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇటు బీజేపీ కూడా టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలను ఒక్కటిగానే చూస్తూ టార్గెట్ చేస్తోంది. కానీ ఈ మూడు పార్టీలూ కాంగ్రెస్‌ను అసలు ప్రత్యర్థిగానే చూడడం లేదు. నిన్న మొన్నటి వరకూ బలమైన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ప్రజల దృష్టిలోనే లేకుండా పోయింది.

జీహెచ్ఎంసీలో గెలుపు టీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గత ఎన్నికల్లో వంద స్థానాలు ఖాయం అని లక్ష్యంగా పెట్టుకుని 99 గెలవడంతో ఈసారి కనీసం ఆ స్థాయిలో గెలవాలి లేదా అంతకంటే ఒక సీటు ఎక్కువే గెలవాలనే పట్టుదలతో ఉంది. ఏ మాత్రం తగ్గినా అది పార్టీ ప్రతిష్ట ప్రజల్లో మసకబారుతోందనే సంకేతం వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మొదలు అన్ని ఎన్నికల్లోనూ అనూహ్య విజయాలు సాధిస్తున్న టీఆర్ఎస్‌కు తొలిసారిగా దుబ్బాకలో చేదు అనుభవాన్ని చవిచూసింది. “ఆ గెలుపును మైండ్‌లోంచి తీసేయండి..” అని ముఖ్యమంత్రి కేసీఆర్, “ఒలికిపోయిన పాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరమే లేదు” అని మంత్రి కేటీఆర్ దుబ్బాక ఫలితం గురించి కామెంట్ చేశారు. అది ఒక్క గెలుపు మాత్రమే కానీ జీహెచ్ఎంసీలో పునరావృతమయ్యే అవకాశమే లేదని టీఆర్ఎస్ బలమైన అభిప్రాయంతో ఉంది.

జీహెచ్ఎంసీలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం మాత్రమే కాక గతంకంటే తగ్గని సంఖ్యలో డివిజన్లను గెల్చుకోవడం టీఆర్ఎస్‌కు తప్పనిసరి అవసరంగా మారింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు మరో మూడేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీపై బలమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రధాన ప్రత్యర్థిగా భావించిన కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆ స్థానంలో బీజేపీ ముందుకొచ్చింది. ఆ పార్టీ గెలుపును దుబ్బాకకు మాత్రమే పరిమితం చేయగలిగితే అది టీఆర్ఎస్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరామరక్షగా మారుతుంది. ఇప్పుడు వచ్చే ఫలితాలను బట్టి టీఆర్ఎస్ భవిష్యత్తు నిర్ణయమవుతుందనేది ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

సరిగ్గా బీజేపీ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. దుబ్బాక గెలుపునకు మాత్రమే పరిమితం కావద్దని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలం పెంచుకోవడం ద్వారా 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడానికి దోహదపడాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికల్లో సర్వశక్తుల్నీ వెచ్చిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుతో ముడిపడి ఉండే ఎన్నికలుగా ఈ రెండు పార్టీలూ భావిస్తున్నాయి. కేవలం నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ అదనంగా ఎన్ని స్థానాల్లో గెలిచినా అది ఆ పార్టీ బలపడిందనే దానికి సంకేతమే అవుతుందని, కానీ అధికార టీఆర్ఎస్‌కు మాత్రం గతంలో సాధించిన 99 డివిజన్లకంటే ఏ మాత్రం తగ్గినా ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గుతుందనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందనేది సీనియర్ రాజకీయ నాయకుల అభిప్రాయం.

ఇంతకాలం ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతూ సీనియర్ నేతలు సైతం ఆ పార్టీని వీడే స్థాయికి పడిపోయింది. ప్రతి ఎన్నికల్లో ఎదుర్కొంటున్న ఓటమి, తగ్గిపోతున్న ఓట్లు తదితరాలన్నింటితో ప్రజల్లోనూ ఆ పార్టీకి గతంలో ఉన్న ఆదరణ తగ్గిపోయింది. దుబ్బాకలో మూడవ స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతకంటే దిగజారిపోతుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ తర్వాతి స్థానానికే పరిమితం కావడం తప్పదని భావిస్తున్నారు. ఇక కొత్తగా ఉనికిలోకి వచ్చిన తెలంగాణ జన సమితి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన లాంటి పార్టీలన్నీ డిపాజిట్ కోసం పాకులాడే పరిస్థితిలో ఉన్నాయి.

Next Story