బీజేపీ వర్సెస్ బీజేపీ

by  |
బీజేపీ వర్సెస్ బీజేపీ
X

రాజకీయ నేతలు హామీలనివ్వడం.. వాటిని తప్పడం మనం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి హామీనివ్వనేలేదని బుకాయించడమూ గమనిస్తుంటాం. కొన్నిసార్లయితే.. నేతలు వారు మాట్లాడినదానికే విరుద్ధంగా వ్యాఖ్యానిస్తుంటారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. అధికారికంగా వెల్లడించే విషయాలు ఒకలా ఉంటే బయట కమలం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి.

‘లవ్ జిహాద్’ పై కేంద్రంలో అధికారంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రకటన.. బయట ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు విరుద్ధంగా ఉంటున్నాయి. ‘లవ్ జిహాద్’ అనే పదానికి మన చట్టాల్లో ఎటువంటి నిర్వచనంలేదని లోక్‌సభలో ఈ నెల 4న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. లవ్ జిహాద్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కాలేదని వివరించారు. అంతేకాదు, ఆర్టికల్ 25 ప్రకారం ప్రజలు ఏ మతాన్నైనా స్వీకరించొచ్చు, ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. కేరళ హైకోర్టుసహా ఇతర న్యాయస్థానాలు ఈ హక్కును ఎత్తిపట్టాయని గుర్తు చేశారు.

తర్వాతి రోజే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పికె కృష్ణదాస్ మాట్లాడుతూ ఇప్పుడు ఉనికిలో ఉన్న చట్టాలు లవ్ జిహాద్‌ను నిర్వచించడం లేదుగానీ, దేశంలో ఈ సమస్య ఉన్నదని అన్నారు. అంతేకాదు, అటువంటి కేసుల్లో దర్యాప్తు చేపట్టాలని కేంద్ర హోంశాఖను కోరుతున్నారని చెప్పారు. ఓ వర్గం యువకులు ఇతర మతస్తుల యువతులను వలలో వేసుకుని మతమార్పిడులు చేస్తున్నారని, దాన్నే లవ్ జిహాద్‌ అని బీజేపీ నేతలు చెబుతుంటారు.

అలాగే, ‘టుక్డే టుక్డే’ వ్యాఖ్యలపైనా ఇటువంటి వైఖరే ఉంది. కేంద్ర హోం శాఖ ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ పై ఎటువంటి సమాచారం లేదని తెలిపింది. కానీ, ఇప్పటికీ ప్రభుత్వ విమర్శకులు, జేఎన్‌యూ విద్యార్థులను ‘టుక్డే టుక్డే’ అని బీజేపీ నేతలు సంబోధిస్తుంటారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు సంధించారు. టుక్డే టుక్డే బృందంతో ఫొటోలు దిగే కొందరు నేతలు పౌరసత్వ సవరణ చట్టంపై ఇప్పటికే చాలా మాట్లాడారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టుక్డే టుక్డే గ్యాంగ్ అంటూ ఏమీ లేదని కేంద్ర హోంశాఖ వెల్లడించినా ప్రధాని మాత్రం సర్కారు విమర్శకుల నోరుమూసే యత్నం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.


Next Story