ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్

by  |
ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో రక్షాబంధన్ జరుపుకుంటే గవర్నర్ మాత్రం ప్లాస్మా దాతలతో జరుపుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సామాజిక అవసరాన్ని గుర్తించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్‌భవన్‌కు ప్లాస్మా దాతలను ఆహ్వానించి వారి సమక్షంలో రాఖీ పౌర్ణమి సంబురాలను జరుపుకున్నారు. వారిని ప్రాణదాతలుగా అభివర్ణించారు. కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకుని వ్యక్తులుగా తిరిగి కుటుంబాలతో కలిసినా అదే వైరస్ బారిన పడి చావుబతుకుల్లో ఉన్న పేషెంట్లకు ప్లాస్మాను దానం చేసి పునర్జన్మ ప్రసాదించారని వారి చొరవను కొనియాడారు. పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లను కాపాడిన 13 మంది ప్లాస్మా దాతలకు స్వీట్లు అందించి సంతోషాన్ని పంచుకున్నారు.

రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సోషల్ డిస్టెన్స్ నిబంధనను పాటిస్తూ ప్లాస్మాదాతల ధాతృత్వాన్ని, ప్లాస్మాను దానం చేయాలన్న వారి సామాజిక బాధ్యతను అభినందించారు. ఈ 13మంది ప్లాస్మా దాతలూ కరోనా బారిన పడి ప్రభుత్వ గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుని కోలుకున్నారని నొక్కిచెప్పారు. ప్రజలు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా చికిత్సను నమ్మకంగా తీసుకోవచ్చని, అక్కడి వైద్య సిబ్బంది అంకితభావంతో అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రులు లాభార్జనను పక్కనపెట్టి మానవతా దృక్పథంతో చికిత్స అందించాలని, సామాన్యులకు భారం లేని తీరులో సరసమైన ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని కోరారు. పేషెంట్ల కుటుంబాలను మరింత కుంగదీయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

రాష్ట్రంలోనే మొట్ట మొదటి కోవిడ్ పేషెంట్‌గా నిర్ధారణ అయిన రాంతేజ గంపాల ప్లాస్మా దానం చేశారని గుర్తుచేసిన గవర్నర్ తొలి ఇరవై మంది పాజిటివ్ పేషెంట్లలో ఒకరైన వరంగల్‌కు చెందిన ఎన్నంశెట్టి అఖిల్ రాష్ట్రంలోనే తొలి ప్లాస్మా దాత అని పేర్కొన్నారు. ముంబయి ఐఐటిలో చదువుకున్న విద్యార్థి నితిన్ కుమార్ నాలుగుసార్లు ప్లాస్మా దానం చేశారని, వీరితో పాటు సురం శివ ప్రతాప్, సయ్యద్ ముస్తఫా ఇర్ఫాన్, ఉమర్ ఫరూఖ్, డా. సుమీత్, జె. రాజ్‌కుమార్, పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై పి. రామకృష్ణా గౌడ్, ఎస్. శివానంద్, డా. సాయి సోమసుందర్, డా. రూప దర్శిని తదితరులంతా కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం ద్వారా ఇతరులకు ప్రాణప్రతిష్ట చేశారని గవర్నర్ వారి ఆలోచనను, బాధ్యతను అభినందించారు. ఈ 13మందిలో ఆరుగురు రెండుసార్లకంటే ఎక్కువగా ప్లాస్మాను దానం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.


Next Story