ఎస్‌టీ రిజర్వేషన్ పెరిగేదెపుడు?

by Disha edit |
ఎస్‌టీ రిజర్వేషన్ పెరిగేదెపుడు?
X

తెలంగాణ రాష్ట్రంలో తమ రిజర్వేషన్ శాతం పెంచాలని కోరుతూ 33 గిరిజన తెగలు ఆందోళన చేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఉన్న ఆరు శాతం రిజర్వేషనే నేటీకి అమలవుతున్నది. గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని 12కు పెంచుతామని, ప్రతి గిరిజన కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అది ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు. దీంతో గిరిజనులకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది.

గిరిజనుల ఆర్థిక వనరులు, జీవన స్థితిగతుల అధ్యయనం కోసం ప్రభుత్వం చెల్లప్ప కమిషన్‌ను నియమించింది. రెండేళ్ల పాటు అధ్యయనం చేసిన కమిషన్ వాల్మీకి, బోయ, కాయితీ లభానీ (బీసీ)లను ఎస్‌టీ జాబితాలో చేర్చాలని సూచించింది. ఇటు గిరిజన రిజర్వేషన్ల శాతం పెరగకపోవడంతో ఎనిమిదేండ్ల నుంచి వారు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో, అభివృద్ధిలో తీవ్రంగా నష్టపోతున్నారు.

దానిని సాకుగా చూపించి

ఆర్టికల్ 16(4) ప్రకారం తెలంగాణలో 9.34 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని హైకోర్టు 2015 లో తీర్పునిచ్చింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పది శాతం రిజర్వేషన్ పెంచుతున్నామని ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసింది. బీసీలకు 37 శాతం, ఎస్‌టీలకు 10 శాతం, ఎస్‌సీలకు 15 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం మొత్తం 72 శాతానికి రిజర్వేషన్‌ పెంచాలని కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపించింది. అక్కడి నుంచి నేటికీ స్పందన లేదు. బిల్లును సాకారం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయనూ లేదు.

రాజ్యాంగం ప్రకారం 50 శాతం వరకు మాత్రమే రిజర్వేషన్ పెంచుకునే అర్హత ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. అంతకుమించి పెంచుకోవాలంటే పార్లమెంటుదే అధికారమని స్పష్టం చేసింది. దీనిని సాకుగా చూపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. తమిళనాడులో 60 శాతం, మహారాష్ట్రలో 50 శాతానికి మించి పెంచుకోవడం ఎలా సాధ్యపడిందో ఆలోచించాలి. అక్కడ రాజకీయ పార్టీలు ఒక్కటై కేంద్రాన్ని డిమాండ్ చేసి రిజర్వేషన్ సాధించుకున్నాయి.

ఎవరూ అడగకుండానే

గిరిజన రిజర్వేషన్ గురించి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి కేంద్రానికి 2022 ఫిబ్రవరిలో లేఖ రాశారు. 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అది తేలేవరకు క్లియరెన్స్ ఇవ్వలేమని' కేంద్రం చెబుతోంది. పెండింగ్ కేసుకు గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ముడిపెట్టి మాట్లాడటం సరైంది కాదు. రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనా రాలేదని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పడం ఆశ్చర్యకరం.

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెంచే జీఓకు భద్రత ఉంటుందా? అందుకే కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని రిజర్వేషన్ పెంచాలి. అగ్రవర్ణాల విషయంలో సాహసం చేసిన కేంద్రం గిరిజనుల విషయంలో ఎందుకు చేయడం లేదు? 1981 తరువాత అనేక రాష్ట్రాలలో ఎస్‌టీ, ఎస్‌సీ జనాభా గణనీయంగా పెరిగింది. గిరిజనులకు వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది.

జటావత్ హనుమ

ఓయూ, హైదరాబాద్

851983 6308


Next Story

Most Viewed