నష్టాల్లోకి నెట్టిన ప్రభుత్వ విధానం

by  |
నష్టాల్లోకి నెట్టిన ప్రభుత్వ విధానం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : సన్న బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ‘సన్న బియ్యం.. సగటు మధ్య తరగతి కుటుంబానికి కల. తెలుగు రాష్ట్రాల్లోనైతే సన్నబియ్యం దందా తారాస్థాయిలో జరుగుతుంది. చాలామంది వ్యాపారులు సన్నబియ్యం అమ్మకాలనే ప్రధాన వ్యాపకంగా చేసుకుని రూ.కోట్లు గడించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంతటి డిమాండ్ ఉన్న సన్నబియ్యాన్ని పండించే అన్నదాతలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది వరకు కాస్త ప్రయోజనం చేకూరినా, ఈయేడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నియంత్రిత సాగుతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. గత వానాకాలం సీజన్‌లో సన్నవడ్లు క్వింటా రూ.2వేలు పలికితే, ప్రస్తుతం రూ.1300 నుంచి రూ.1700 మాత్రమే పలుకుతోంది. సర్కారు భరోసా ఇచ్చిన సన్నాల పంట, రైతులకు మంట పుట్టిస్తోంది. ఆరుగాలం కష్టించిన పంటకు మద్దతు ధర కూడా రాకపోవడం వల్ల అప్పులు తీర్చేమార్గం లేక తల్లడిల్లుతున్నారు.

తారుమారు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాధారణంగా దొడ్డు రకం వరి అధికంగా సాగవుతుంది. ఈ ఏడాది ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో 60 శాతం సన్నాలు, 40 శాతం దొడ్డు రకాలు సాగు చేయాలని సూచించింది. చాలా మంది రైతులు ప్రభుత్వం చెప్పిన విధంగా సన్నాలే సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలకు తోడు తెగుళ్లు రైతుల నడ్డి విరిచాయి. ఎప్పుడూ సాగు చేసే దొడ్డు రకం వేసినా కనీసం శ్రమకు వేతనమైనా లభించేదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. దీనికి తోడు మార్కెట్లోనూ సన్నాలకు ధరలు పడిపోవడంతో అన్నదాత లబోదిబోమంటున్నాడు.

మస్తు పెట్టుబడి అయ్యింది..
సన్నాల సాగుతో తీవ్రంగా నష్టపోయామని సాగర్ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొడ్డు రకంతో పోలిస్తే తెగుళ్లు తీవ్రంగా ఆశించాయని, పెట్టుబడి విపరీతంగా పెరిగిందని అంటున్నారు. కొన్నిచోట్ల తెగుళ్లు ఎంతకీ వీడకపోవడంతో పలువురు రైతులు పంటకు నిప్పుపెడుతున్నారు. దిగుబడి సైతం దొడ్డు ముందు సన్నాలు దిగదుడుపే. దొడ్డు రకం ఎకరానికి 30 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, సన్నాలు 22 నుంచి 24 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. దొడ్డు పంట విక్రయిస్తే పెట్టుబడి పోగా కనీసం రూ.20వేలు మిగులుతోంది. అదే సన్న రకమైతే నష్టమే మిగులుతోంది. సన్నాల సాగుతో ఆర్థికంగా చితికిపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్వింటాల్ రూ.2500 చెల్లించాలి..
నాకు మూడెకరాల పొలం ఉంది. ఏటా దొడ్డు రకం సాగు చేసేటోడ్ని. ఎటూ లేదన్న ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. పెట్టుబడి పోనూ నా కష్టం ఫలితం రూ.15 వేలకు పైగా మిగిలేది. కానీ ఈ వానాకాలంలో కేసీఆర్ చెప్పిండని మొత్తం సన్నవడ్లే పెట్టిన. మస్తు వానలు పడడంతో పాటు తెగుళ్ల దెబ్బకు దిగుబడి రాలే. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రేటు చూస్తే రూ.1500 అంటుర్రు. 20 రోజులైతుంది వడ్లు మార్కెటుకు పోసుకొచ్చి, కాంటా కాలే. ఇంక పైసలు వచ్చుడు దేవుడెరుగు, యాసంగికి ఏం పెట్టి పంటలు వేయాల్నో అర్థం కాట్లే. ప్రభుత్వమే సన్నాలకు రూ.2500 చెల్లించాలి. అట్లయితనే ఈ యేడు గట్టెక్కుతం.



Next Story

Most Viewed