సీనియర్ అసిస్టెంట్ కుర్చీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. భూ రికార్డుల్లో మార్పులు.?

by  |
సీనియర్ అసిస్టెంట్ కుర్చీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. భూ రికార్డుల్లో మార్పులు.?
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల కుర్చీపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూర్చొని భూ రికార్డులు పరిశీలించడం పలు విమర్శలకు తావిస్తోంది. సీనియర్ అసిస్టెంట్ చైతన్య.. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కూర్చోబెట్టుకొని భూముల వివరాలు, రికార్డులను కంప్యూటర్‌లో ఉన్న రికార్డులను వ్యాపారికి చూపించడం సంచలనంగా మారింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో రికార్డు అసిస్టెంట్.. పలు భూములకు సంబంధించిన రికార్డులను చూపిస్తూ దిద్దుబాట్లు చేయడం వెనక మతలబు ఏమిటని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చేయడం వెనుక.. వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించిన భూ రికార్డులను తారు మారు చేసే అవకాశం ఉన్నట్టు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాయకులకు, ఉద్యోగులు అతిథి మర్యాదలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కూడా ఆ అధికారి ముందు.. నాయకులు ఉండి వారి పనులను తొందరగా కానిచ్చేసుకుంటారని ప్రజలు అంటున్నారు.

సామాన్య ప్రజలు తమ సమస్యలపై తహసీల్దార్ కార్యాలయంలో మొరపెట్టుకున్నా.. మాకు తెలియదు మహబూబ్ నగర్ కలెక్టరేట్‌కు వెళ్ళండి అని ఉచిత సలహాలు ఇస్తారని ఆరోపిస్తున్నారు. జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో పైరవీకారులదే ఇష్టా రాజ్యమని అంటున్నారు. సాయంత్రం ఆఫీసు సమయం ముగిసినా పైరవీకారులతో కార్యాలయం మాత్రం కిటకిటలాడుతుండటం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంపై దృష్టి పెట్టి ఉద్యోగులను హెచ్చరించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు సామాన్యులకు సైతం త్వరితగతిన పనులు పూర్తి చేసేలా ప్రజలకు భరోసా కల్పించాలని జడ్చర్ల పట్టణ మండలవాసులు కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed