ఉద్యమ ద్రోహులను తరిమికొట్టండి.. గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

by  |
ఉద్యమ ద్రోహులను తరిమికొట్టండి.. గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కరీంనగర్ సిటీ : శాసనమండలి స్థానిక సంస్థల కరీంనగర్ నియోజకవర్గ ఎన్నికల్లో మళ్లీ హుజూరాబాద్ తీర్పు పునరావృతం అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. శనివారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సాధారణ ప్రజలే కాదు ప్రజాప్రతినిధులకు సైతం ముఖ్యమంత్రి దర్శనం లభించడంలేదని విమర్శించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించినట్లు ప్రకటించుకొని కుటుంబ పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ఆర్థికంగా బలవంతులైన వారిని మాత్రమే తన కోటలో చేర్చుకొని పదవులు అప్పగిస్తున్నాడని మండిపడ్డారు.

పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, ఆర్థికంగా నష్టపోయి కేసుల పాలైన వారిని కూడా ముఖ్యమంత్రి విస్మరించారని, ఉద్యమ ద్రోహులు, ఎన్నారైలకు పెద్ద పీట వేసి అక్కున చేర్చుకుంటుండటం శోచనీయమన్నారు. 13 మంది అగ్రవర్ణ నేతలకు ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చి, మిగతా సామాజిక వర్గాలకు ప్రాతిపదికన కేటాయించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని.. ఆర్థికంగా, ఆయనకు వెన్నుదన్నుగా ఉండే వారికే తాయిలాలు ప్రకటించటం అలవాటని ఎద్దేవ చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి సేవ చేసే వ్యక్తికే స్థానిక ప్రజా ప్రతినిధులు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు, మండలి ఎన్నికల అనంతరం తిరిగి కనపడరని, అలాంటి వారితో సమస్యల పరిష్కారం ఎలా సాధ్యమవుతుందనేది ఆలోచించాలని కోరారు.

ఆర్థిక, అధికార బలంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకపక్షంగా తీసుకునేందుకు అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నించిందని అన్నారు. అలాగే నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా స్వతంత్ర అభ్యర్థులపై దౌర్జన్యం చేసి నామినేషన్లు బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. పారదర్శక పాలన పేరు ప్రజాధనం వృధా చేస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఆగడాలకు కళ్లెం వేయాలంటే ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీనవర్గాలకు అధికారం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, నిరంతర ప్రజాసేవకుడు సర్దార్ రవీందర్ సింగ్‌ను గెలిపించి కేసీఆర్‌కు కనువిప్పు కలిగించాలన్నారు. పార్టీ అక్రమాలపై తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్టు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed