కీలక మ్యాచ్ డ్రా.. హైదరాబాద్ సెమీస్ ఆశలు గల్లంతు

72
ISL

దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశాలను హైదరాబాద్ ఎఫ్‌సీ చేజార్చుకున్నది. ఆదివారం సాయంత్రం ఫటోర్డా స్టేడియంలో గోవా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. టాస్ గెలిచిన గోవా క్లబ్ ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకుంది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్లు బంతిని తమ నియంత్రణలో ఉంచుకోవడాని ప్రయత్నించాయి. గోవా 6 సార్లు, హైదరాబాద్ 5 సార్లు గోల్ పోస్టుపై దాడి చేసినా స్కోర్ చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. హైదరాబాద్ జట్టు గెలిస్తే టాప్ 4లోకి వెళ్లి ఉండేది. కానీ మ్యాచ్ డ్రా చేసుకోవడంతో 5 స్థానంలోనే ఉండిపోయింది. దీంతో గోవా ఎఫ్‌సీ సెమీస్‌కు చేరుకున్నది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు ఎడ్యూ బేడియా, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆదిల్ ఖాన్ గెలుచుకున్నారు.

ఆదివారం రాత్రి జీఎంసీ స్టేడియంలో జరిగిన ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబయి సిటీ 2-0 గోల్స్ తేడాతో ఏటీకే మోహన్ బగాన్ జట్టుపై గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచిన ముంబయి సిటీ ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకుంది. లీగ్ విజేతగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి సిటీ దూకుడు ప్రదర్శించింది. 7వ నిమిషంలో అహ్మద్ ఇచ్చిన పాస్‌ను ముర్తాడా ఫాల్ గోల్‌గా మలిచి ముంబయి సిటీకి 1-0 ఆధిక్యత తీసుకొచ్చాడు. 39వ నిమిషంలో బర్త్‌లోమయ్ గోల్ చేయడంతో ముంబయి సిటీ ఆధిక్యం 2-0కు చేరుకున్నది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ముంబయి సిటీ 2-0 తేడాతో విజయం సాధించింది. ముంబయి, ఏటీకే మోహన్ బగాన్ జట్లు రెండూ 40 పాయింట్లతో ఉన్నా.. లీగ్‌లో అత్యధిక గోల్స్ చేసిన ముంబయి సిటీ టేబుల్ టాపర్‌గా నిలిచింది. దీంతో లీగ్ విజేతగా ముంబయిసిటీ నిలువనున్నది. ఈ మ్యాచ్‌తో ఈ సీజన్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ముంబయి సిటీ, ఏటీకే మోహన్ బగాన్, నార్త్ఈస్ట్ యునైటెడ్, గోవా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..