దీన స్థితిలో దాయాదీ దేశం

by  |
దీన స్థితిలో దాయాదీ దేశం
X

ఇస్లామాబాద్: దాయాదీ దేశం పాకిస్తాన్‌ను కరోనా కబలిస్తోంది. ఇప్పటికే అక్కడ కరోనా పాజిటివ్ కేసులు చైనాను దాటిపోయాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతుండటంతో ఇమ్రాన్ ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేసింది. దీంతో రోజురోజుకూ అక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పాక్-చైనా సరిహద్దులో ఉన్న పీవోకే (గిల్గిత్-బాల్టిస్థాన్) ప్రాంతంలో అత్యధికంగా కరోనా కేసులే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ దాదాపు వెయ్యి మంది కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌లో ఆరోగ్య సౌకర్యలు మొదటి నుంచి సరిగా లేవు. అక్కడి ఆసుపత్రుల్లో సరైన పరికరాలు, మెరుగైన డాక్టర్లు లేరని డబ్ల్యూహెచ్‌వో కూడా తెలిపింది. ఇక గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతం మొత్తానికి కలిపి రెండే వెంటిలేటర్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అసలేం జరుగుతోంది..

పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్‌ను గిల్గిత్-బాల్టిస్థాన్ అని వ్యవహరిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆ భూభాగం మాదే అని చూపించుకుంటున్నా.. అధికారికంగా మాత్రం అది పాక్ భూభాగం కాదు. అక్కడ ప్రత్యేక అధికార వ్యవస్థ ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం గత నాలుగు దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నా.. అక్కడ మౌళిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. సరైన రోడ్డు మార్గాలు, వైద్య, విద్య ప్రజలకు అందుబాటులో ఉండవు. ఎంతో విశాలమైన ఆ ప్రాంతం అంతటికీ కలిపి రెండే వెంటిలేటర్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అక్కడి ఆసుపత్రుల్లో పని చేసే వారికి జ్వరం, దగ్గు వంటి వాటికి వైద్యం అందించడం తప్ప మరో వ్యాధికి చికిత్స చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కరోనా కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అక్కడ వెయ్యి కేసుల వరకు నమోదైనట్లు స్థానిక అధికారులు తెలుపుతున్నారు.

హక్కుల కార్యకర్తల నిరసనలు..

గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఉండే హక్కుల కార్యకర్తలు ఇప్పుడు వైద్య సదుపాయాల కోసం పోరాడుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన డాక్టర్ అంజాద్ అయూబ్ మీర్జా చేసిన ట్వీట్ తర్వాత అసలేం జరుగుతోందో ప్రపంచానికి తెలిసింది. ఆ ట్వీట్ తర్వాత స్థానికి మీడియా అతనితో మాట్లాడగా.. ప్రభుత్వం కరోనా పేరుతో చాలా విరాళాలు సేకరించింది. కానీ ఆ నిధులను ప్రజల కోసం వాడకుండా సొంత పనుల కోసం వాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు తమ హక్కులను కోల్పోయారు.. చివరికి కరోనా కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంత యువకులకు ఉద్యోగాలు దొరకడం లేదని ఆయన వాపోయారు.


Next Story

Most Viewed