కేటీఆర్‌కు బిగ్ షాక్.. రూ. 500 కోట్లు ఇవ్వాలని డిమాండ్

by  |
కేటీఆర్‌కు బిగ్ షాక్.. రూ. 500 కోట్లు ఇవ్వాలని డిమాండ్
X

దిశ, సిటీ బ్యూరో: బల్దియాలో వివిధ పనులకు సంబంధించి పేరుకుపోయిన బిల్లులు ఇప్పించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ శుక్రవారం మున్సిపల్ మంత్రి కే. తారకరామారావుకు వినతిపత్రం సమర్పించారు. మంత్రి అందుబాటులో లేకపోవటంతో ఆయన కార్యాలయంలోని సిబ్బందికి ఈ వినతిప్రతం సమర్పించినట్లు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హనుమంత్ సాగర్‌లు తెలిపారు. ఇప్పటి వరకు చాలా సార్లు మేయర్, కమిషనర్లను కలిసి తమ బిల్లుల కోసం అడిగినా పాలక మండలి నుంచి గానీ, అధికారుల నుంచి గానీ సంతృప్తికరమైన సమాధానం రాకపోవటం వల్లే మంత్రి కేటీఆర్‌కు వినతిప్రతం సమర్పించాల్సి వచ్చిందని, ఆయన వచ్చే నెల 8వ తేదీన తమ బిల్లుల విషయమైన తమతో చర్చించేందుకు సమయమిచ్చారని వారు తెలిపారు. ఒక్క వర్షాకాలం ఎమర్జెన్సీ బృందాలు మినహా మిగిలిన పనులన్నీ నిలిపివేసినా, అధికారులు తమ బిల్లులు చెల్లించటం లేదని, ఇక తమ ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించి, శుక్రవారం ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్ల అత్యవసర సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు తాము చేసిన పనులకు అధికారులు బిల్లులు చెల్లించకపోవటంతో చాలా మంది కాంట్రాక్టర్లు అప్పలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులెదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇక త్వరలోనే వర్షాకాల ఎమర్జెన్సీ బృందాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం జనవరి 29న చెల్లింపులు జరిపారని, ఇంకా రూ. 500 కోట్ల వరకు పాత బిల్లులున్నాయిని వెల్లడించారు. అంతేగాక, తాము చేసే అభివృద్ది పనులను చూపి, ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థించే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను కూడా తమ ఆందోళనకు మద్దతునివ్వటంతో పాటు తమ ఆందోళనలో వారు కూడా భాగస్వాములయ్యేలా కార్యచరణనను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

గ్రేటర్ పరిధిలో ఎక్కడా కూడా ఏ చిన్న పని జరగకుండా కాంట్రాక్టర్లు చూడాలని, ఎక్కడైనా ఏదైనా అభివృద్ది పని జరుగుతున్నట్లు సమాచారం వస్తే వెంటనే దాన్ని అడ్డుకోవాలని, దీని ద్వారా తాము పనులెందుకు ఆపేస్తున్నామన్న విషయం ప్రజాప్రతినిధులకు తెలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలువురు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లతో సహా బీజేపీకి చెందిన కార్పొరేటర్లు తమకు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దృష్టికి కూడా తమ సమస్య వెళ్లిందని, ఈ సమస్యపై చర్చించేందుకు త్వరలో సమయమివ్వనున్నట్లు వారు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో పాత బిల్లులు పూర్తిగా చెల్లించిన తర్వాతే కొత్త పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.


Next Story

Most Viewed