దేశంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్స్‌కు ఆ బాధ్యతలు

by  |
దేశంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్స్‌కు ఆ బాధ్యతలు
X

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా వైరస్ దెబ్బకు బతుకీడ్చటం భారంగా మారిన ట్రాన్స్ జెండర్‌లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్స్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేకదృష్టి సారించింది. వరంగల్ బస్ స్టేషన్ ప్రాంతంలో వినూత్నంగా దేశంలోనే మొట్ట మొదటిసారిగా జనరిక్ ఫార్మసీ ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతను ట్రాన్స్ జెండర్ల‌కు అప్పగించారు.

దేశంలోనే మొదటిసారి..

కరోనా వైరస్ కారణంగా అనేకమంది ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ విధించి వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ చేయడంతో చిరు ఉద్యోగులు, రోజువారీ కూలీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో నివాసం ఉండే ట్రాన్స్ జెండర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. దీంతో వారు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి తమకు ఏదైనా ఉపాధి కల్పించాలని వేడుకున్నారు. దీంతో విషయం తెలిసిన వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి వారిపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బల్దియా నుంచి లింగ అనుసంధానం చేయడానికి కృషి చేస్తూ మెప్మా, యూఎంసీ విభాగాల ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాలతో పాటు ఎస్ఎల్ఎఫ్‌లు, టీఎల్ఎఫ్‌లతో ఫెడరేషన్‌లు ఏర్పాటు చేశారు. త్రినగరి (వరంగల్, హన్మకొండ, కాజీపేట)లో చాలా మంది ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు ఉన్నారని, లింగ సమానత్వం ఉండేలా చూస్తూ సమాజంలో సమైక్యతను పెంపొందించేలా చర్యలు చేపట్టారు.

(రెండు వారాల్లో కరోనా టీకా?)

వారందరూ గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో జనరిక్ ఫార్మసీని ఏర్పాటు చేసి, వారికి కేటాయించారు. జనరిక్ మందులు ఇతర మందులతో పోలిస్తే 1/3 ధరల్లోనే లభ్యమవుతాయన్న విషయం తెలిసిందే. ఇలాంటి మెడిసిన్స్ వినియోగంతో పేద రోగులు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. కమర్సియల్ ప్రాంతాల్లో ఫార్మసీలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాన్స్ జెండర్‌లకు, పేద రోగులు ఇరువురికీ లబ్ది చేకూరుతుందని భావించారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన సెంటర్లలో ట్రాన్స్ జెండర్‌లకు కమ్యూనిటీ టాయిలెట్ నిర్వహణతో పాటు పబ్లిక్ టాయిలెట్‌లోని లూ కేఫ్(లక్జరీ)ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా నర్సరీల నిర్వహణ కోసం వీరికి ఎస్‌హెచ్‌జీ సభ్యులచే శిక్షణ ఇప్పించారు. ఈ నేపథ్యంలో జనరిక్ ఫార్మసీ‌లు ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించి ఉపాధి అవకాశాలు కల్పించారు. దీంతో విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కల్పించడంతో ట్రాన్స్ జెండర్ల సంఘం అధ్యక్షురాలు లైలా, సభ్యులు సిరి, స్నేహ, అశ్విని, రేష్మ తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed