తరాలు మారినా.. రైతుల తలరాతలు మారలే

by  |
తరాలు మారినా.. రైతుల తలరాతలు మారలే
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తరాలు మారాయి.. ప్రభుత్వాలు మారాయి.. పాలకులు మారారు.. కానీ దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న తలరాతలు మాత్రం మారడం లేదు. ఏండ్లు గడుస్తున్నా.. కూటికీ గుడ్డకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రతిఒక్కరి నోట్లోకి బుక్కెడు బువ్వ పెట్టే అన్నదాతలే.. వ్యవ‘సాయం’ చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ఎదుట సాయం కోసం అర్రులుచాచాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా.. మేధావులు ఎన్ని సూచనలు చేసినా.. ఫలితం బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందనడంలో ఏలాంటి సందేహం లేదు. దేశాన్నంతటిని తన భుజస్కంధాలపై మోస్తోన్న రైతన్నల వెన్నుముక వంగిపోతున్నా.. వారికి ఆసరాగా నిలిచేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో దుర్భర స్థితులను గడపాల్సి వస్తోంది. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దిశ ప్రత్యేక కథనం.

పాలకుల పరిహాసమే కారణమా..

ఇంతటి ఆధునిక కాలంలోనూ అన్నదాతలు దుర్బర పరిస్థితుల్లోంచి బయటపడకపోవడానికి పాలకుల పరిహాసమో కారణమా..?. లేక కార్పొరేట్ కబంధ హస్తాల్లో కీలు బొమ్మలా మారి అన్నదాతలకు వెన్నుపోటు పోడుస్తున్నారా? అన్నది అంతుబట్టని సంగతి. ఎన్నికలొచ్చాయంటే.. రాజకీయ పార్టీలకు రైతు ఒక ప్రచార హస్తంగా మారుతున్నాడు. రాయితీలు.. సబ్సిడీలంటూ అర్భాటపు ప్రచారాలు చేస్తూ రైతాంగాన్ని నిలువునా ముంచేస్తున్నారు. కానీ ఎన్నికల్లో గెలిచాక.. వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ రైతుల పట్ల అవలంభిస్తున్న విధానాలు పూర్తిగా రైతు వ్యతిరేకమనే చెప్పాలి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన చందంగా రైతుల పట్ల సానుభూతి చూపుతున్నామనే పేరుతో నెట్టుకొస్తున్నారు. నిజానికి రైతుల పట్ల అసలు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వారు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వాలు, పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు రావడం అందరూ సిగ్గు పడాల్సిన విషయమే. ఎందుకంటే.. రైతుల దగ్గర కేజీ సన్నబియ్యం కొనాలంటే.. రూ.30కి మించి పెట్టరు. అదే కార్పొరేట్ మాల్స్‌లో ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి కిలో సన్నబియ్యం రూ.40 నుంచి రూ.60కి అమ్మినా నోరు మెదపకుండా తీసుకొస్తున్నాము. కార్పొరేట్ మాల్స్‌ కంటే స్వయంగా రైతు పండించిన ఉత్పత్తులు ఎంతో బెటర్. కానీ ఏ వినియోగదారుడు ఆ తరహాలో ఆలోచించేందుకు ఆసక్తి చూపరు.

కేంద్రానిది ఓ దారైతే.. రాష్ట్రానిది మరో దారి..

వ్యవసాయం విషయంలో కేంద్ర ప్రభుత్వానిది ఒక దారైతే.. రాష్ట్రానిది మరో దారి. అయితే ఈ రెండూ ప్రభుత్వాల వల్ల రైతులకు చేకూరిన ప్రయోజనం శూన్యమే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. పంజాబ్ సహా పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీని తమ ఆందోళనతో అట్టుడికిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు కార్పొరేట్ సంస్థల చేతుల్లో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందని కొంతమంది మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగడం లేదు. ఈ వ్యవహారంపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ బంద్‌కు మద్దతు పలికింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు రొడ్డెక్కారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద నిరసనే ఎదురయ్యిందని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై సెటైర్లు పేలాయి. ‘కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల సంగతి సరే సారూ.. ముందుగా తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల వద్ద దారుణ పరిస్థితులను అనుభవిస్తున్న రైతులను జర పట్టించుక్రోండి..’ అంటూ ట్రోల్స్ పెరిగాయి. సీఎం కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం సన్నవడ్లను సాగు చేసిన రైతాంగానికి క్వింటాల్‌కు రూ.100 బోనస్ ఇచ్చేందుకు సహాసించని ప్రభుత్వం.. కేంద్ర తీసుకొచ్చిన చట్టాలపై మాట్లాడడమూ ప్రజలను ఆలోచింపజేసిందనే చెప్పాలి.

నిజంగా తెలంగాణ పథకాలు ఆదుకునేవేనా..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఘంటాపథంగా చెబుతోంది. వ్యవసాయం విషయంలో దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నామని వీలుచిక్కినప్పుడల్లా మంత్రివర్గ గణం ప్రకటిస్తోంది. రైతు సంక్షేమం కోసమే రైతు బంధు, బీమా అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. నిజానికి ప్రభుత్వ లక్ష్యం మంచిదే కావొచ్చు. కానీ వ్యవసాయ రంగంలో సన్నకారు రైతులే ఎక్కువ శాతం ఉన్నారు. మధ్య తరహా భూములున్న రైతులు ఏలాగోలా నెట్టుకొస్తున్నారు. బడా భూస్వాములు సైతం ఆర్థిక పరిపుష్టిలో ఉన్నారు. ఎటొచ్చి.. సన్నకారు రైతాంగమే రోజురోజూకీ చిక్కిపోతోంది. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధును ఎకరాల ప్రతిపాదికన కాకుండా రైతు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా పంటల సాగుకు సాయం అందించి ఉంటే.. తెలంగాణలో సన్నకారు రైతుల పరిస్థితి మరోలా ఉండేది. అగ్రికల్చర్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతాంగం కకావికలం అవుతోంది.

సబ్సిడీలెందుకు.. గిట్టుబాటు ధర చాలు..

దేశవ్యాప్తంగా రైతాంగం పాలకుల దగ్గర అడుక్కునే పరిస్థితిని కల్పించాయి. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతాంగానికి ఎరువులు, మందులు, విత్తనాలపై సబ్సిడీ అందిస్తూ రైతులను ఒకరకమైన ఊబిలోకి తీసుకెళ్లాయి. ప్రభుత్వం సబ్సిడీ పేరుతో రూ.100 లబ్ధి చేకూర్చితే.. పలు రకాల రూపంలో రైతుల దగ్గరి నుంచి రూ.వెయ్యికి పైగా ముక్కుపిండి వసూలు చేస్తోంది. నిజానికి పంటల సాగు కోసం రైతులకు సబ్సిడీలు ఇచ్చే కంటే.. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తే.. పరిస్థితులు మరోలా ఉంటాయి. వ్యవసాయాన్ని దండుగ కాదు.. పండుగ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ సైతం సన్న వడ్ల విషయంలో కనీసం రూ.100 బోనస్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పంటలు పండించిన రైతులు.. ధాన్యం అమ్ముకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా రైసు మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాశారు. తేమ శాతం, నాణ్యత లేమి పేరుతో కొర్రీలు పెడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను సైతం ఇవ్వకుండా భారీగా కోతలు పెట్టారు. నిత్యం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే ఏ పాలకులు ఆ విషయంపై నోరు మెదపలేదు.

మార్కెటింగ్ సమస్య లోపమా..

వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ సమస్య ప్రధాన లోపంగా కన్పిస్తోంది. రైతులు పండించే పంట ఉత్పత్తులను అమ్ముకునే విషయంలో ఓ మోస్తరు రైతు నుంచి బడా రైతుల వరకు పెద్దగా సమస్యలు ఉండడం లేదు. ఎందుకంటే.. వారికి భూవిస్తీర్ణం ఎక్కువగా ఉండడం.. ఎక్కువ పంట దిగుబడి ఉండడంతో ఎంత దూరంలో మార్కెటింగ్ సౌకర్యం ఉన్నా.. అక్కడికి సులువుగా తీసుకెళ్లి విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కానీ సన్నకారు రైతులకు పంట దిగుబడి తక్కువగా ఉండడం వల్ల వారి ఉత్పత్తులు ఎక్కువ దూరం తీసుకెళ్లి అమ్మితే కనీసం రవాణ ఛార్జీలకు సరిపోయే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మార్కెటింగ్ సౌకర్యాలను రైతుల వద్దకే తీసుకురాగలిగితే.. ఉన్నంతలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఏనాడూ ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంటున్నాయే తప్ప మిగతా ప్రధాన పంట ఉత్పత్తులకు అలాంటి అవకాశం ఉండడం లేదు.

Next Story