మహిళ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు అపహరణ

by Kalyani |
మహిళ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు అపహరణ
X

దిశ, బడంగ్ పేట్​ : తన పిల్లలతో కలిసి వాకింగ్ కు​ వెళ్లి తిరిగి వస్తుండగా ఓ మహిళపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్క్​లు, హెల్మెట్​లు ధరించి కారం నీళ్లు చల్లి చైన్​ స్నాచింగ్​కు పాల్పడిన ఘటన పహాడిషరీఫ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర సంచలనం రేకెత్తించింది. అడ్డుకోబోయిన తల్లీ కూతుళ్లపై కర్రతో దాడి చేశారు. కీ పెట్టి బైక్​ స్టార్ట్​ చేస్తుండగా మరోసారి పట్టుకోవడానికి ప్రయత్నించడంతో బైక్​ను, బ్యాగును అక్కడే వదిలి అగంతకులు పరారయ్యారు. పహాడీషరీఫ్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... మహేశ్వరం మండలం మంఖాల్​ విలేజ్​కు చెందిన గడ్డమీది కల్పన, మహేందర్​ (32) లు దంపతులు.

వీరిఒక కూతురు, ఇద్దరు కుమారులు సంతానం. లక్ష్మీప్రసన్న, హేమచందర్​, హేమంత్ లు వీరి సంతానం. వేసవి సెలవులను పురస్కరించుకుని గడ్డమీది కల్పన తన ముగ్గురు పిల్లలతో పాటు పొరిగింటి పిల్లలతో కలిసి ప్రతిరోజు సర్వీస్​ రోడ్డులో వాకింగ్​కు వెళ్లేవారు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు కూడా గడ్డమీది కల్పన తన పెద్దకూతురు లక్ష్మీప్రసన్న, హేమచందర్​, హేమంత్​లతో పాటు పొరిగింటి పావని, నేహశ్రీ, మనీష్​ కుమార్​ లతో కలిసి మంఖాల్​ నుంచి శంషాబాద్​ సర్వీస్​ రోడ్డులో ఒక్క కిలోమీటర్​ వరకు వెళ్లారు. తిరిగి ఉదయం 5.50గంటల సమయంలో అరకిలోమీటర్​ వరకు వచ్చారు.

పిల్లలు కాస్త ముందుండగా, గడ్డమీది కల్పన వారి వెనుకాలే నడుస్తుండగా రోడ్డు పక్కన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హెల్మెట్​లు మాస్క్​లు ధరించి ఒక బాటిల్​లో కారం నీళ్లు పట్టుకుని నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు ఆమె కళ్లలో కారం నీళ్లను పోశారు. మరొకరు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును కత్తిరిస్తుండగా గొలుసుచివరను గట్టిగా చేతితో పట్టుకుని అడ్డుకోబోయింది. దీంతో అగంతకులు చేతిలో ఉన్న కర్ర తో ఆమె నుదిటిపై దాడి చేశారు. గమనించిన ఆమె కుమార్తె లక్ష్మీప్రసన్న కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అదే కర్రతో ఆమె తలపై కూడా దాడిచేశారు.

బైక్​ కు కీ పెట్టి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని పెద్దపెట్టున కేకలు వేస్తూ అడ్డుకునే యత్నం చేశారు. దీంతో బైక్​ను, బ్యాగ్​ను అక్కడే వదిలి ఓఆర్​ఆర్​ శంషాబాద్​ వైపు ఇద్దరు అగంతకులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన తల్లీ,కూతుళ్లను చికిత్స నిమిత్తం విజయ ఆసుపత్రికి తరలించారు. మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు విలువ రూ.85వేల ను అగంతకులు కాజేశారని పహాడిషరీఫ్​ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. అగంతకులు అక్కడే వదిలిన బైక్​ను, బ్యాగును పహాడిషరీఫ్​ పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story