బిగ్ బాస్కెట్ గోదాంపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి!.. గోదాం లైసెన్స్ సస్పెండ్

by Ramesh Goud |
బిగ్ బాస్కెట్ గోదాంపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి!.. గోదాం లైసెన్స్ సస్పెండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిగ్ బాస్కెట్ స్టోర్ గోదాంపై దాడి చేసిన అధికారులు స్టోర్ లైసెన్స్ ను సస్పెండ్ చేశారు. హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్‌లు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కొండాపూర్ సమీపంలోని మసీదు బండలో ఉన్న ప్రముఖ ఆన్‌లైన్ విక్రయ సంస్థ బిగ్ బాస్కెట్ గోదాంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. గోదాం నిర్వహిస్తున్న వారు ఫుడ్ సేఫ్టీ విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు తెలిపారు. గోదాంలో గడువు ముగిసిన చికెన్ మసాలా, చికెన్ సాసేజ్, పిజ్జా చీజ్, పనీర్, ఐస్‌క్రీమ్‌లు, ఆల్మండ్‌లు కనుగోన్నారు.

తక్కువ స్థాయి ఆహర పదార్ధాలు, కలుషిత ఆహార పదార్ధాలతో పాటు సరిగ్గా నిల్వ చేయని పాల సీసాలు(10), షేక్ సీసాలు(5), స్టింగ్ టిన్ బాటిళ్లు(50) స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక ఈ గోదాం ఫుడ్, నాన్ ఫుడ్ వస్తువులను కలిపి ఒకే చోట నిల్వ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సీరియస్ అయిన అధికారులు గోదాంపై చర్యలు తీసుకున్నారు. గోదాం నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గోదాము లైసెన్స్ ను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. కాగా గత కొద్ది రోజులుగా నగరంలో పలు హోటళ్లపై దాడులు నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు సరైన ప్రమాణాలు పాటించని 55 హోటళ్లపై చర్యలు తీసుకున్నారు. ప్రజారోగ్యం దృష్యా మరి కోన్ని రోజుల పాటు ఈ సోదాలు జరుగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.

Next Story