ఐపీఎల్‌పై పెదవి విప్పిన గంగూలీ !

by  |
ఐపీఎల్‌పై పెదవి విప్పిన గంగూలీ !
X

బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణపై ఇంకా సందిగ్ధత వీడలేదు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 15కు ఈ మెగా లీగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో ఉండటం.. కరోనా కూడా విజృంభిస్తుండటంతో ఐపీఎల్ నిర్వహణపై సందేహాలు నెలకొని ఉన్నాయి. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ నిర్వహణపై ఆశలు పెట్టుకున్నా.. విదేశీ ప్రయాణాలకు అవకాశం లేకపోవడం ప్రతికూలాంశం. మరోవైపు ఖాళీ స్టేడియాల్లో ఆడేందుకు క్రీడాకారులు, ఫ్రాంచైజీలు కూడా ముందుకొచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఐపీఎల్ నష్టాలను పూడ్చుకోవడానికి జులై-ఆగస్టు మధ్యలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం ఐపీఎల్‌పై గంగూలీ పెదవి విప్పారు. ఐపీఎల్ నిర్వహణపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన కాస్త ఘాటుగానే బదులిచ్చారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను బీసీసీఐ గమనిస్తోందని.. ఇప్పుడే ఐపీఎల్‌పై ఏమీ చెప్పలేమన్నారు. అయినా దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న పరిస్థితిలో క్రీడలకు భవిష్యత్ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ కష్టమని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ మాత్రమే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ క్రీడలైనా నిర్వహించడం అసాధ్యమని గంగూలీ అన్నారు. ఐపీఎల్ భవితవ్యంపై సోమవారం బీసీసీఐ అధికారులందరితో చర్చించి అదే రోజు అప్ డేట్ ఇస్తానని తెలిపారు.

Tags : IPL, Sourav Ganguly, BCCI, Corona, Media



Next Story