డిమాండ్లు సాధించుకున్న నర్సులు

by  |
డిమాండ్లు సాధించుకున్న నర్సులు
X

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఔట్‌సోర్సింగ్ నర్సులు, 4వ తరగతి సిబ్బంది డిమాండ్లను సాధించుకున్నారు. వారందరినీ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కరోనా విధుల్లో పాల్గొంటున్నవారికి ప్రతీరోజూ ప్రత్యేకంగా ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. నర్సులు, కార్మికుల తరఫున ప్రతినిధి బృందంతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లయింది. సంతృప్తి వ్యక్తం చేసిన వీరు సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ నర్సులకు చెల్లిస్తున్న రూ. 17,500 వేతనాన్ని రూ. 25వేలకు పెంచనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చి త్వరలోనే కాంట్రాక్టు పరిధిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించనున్నట్లు భరోసా కల్పించింది. కరోనా విధులు నిర్వర్తిస్తున్న నర్సులకు ప్రతీరోజు రూ. 750 చొప్పున ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో ఇస్తామని తెలిపింది. థర్డ్ పార్టీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో ఉన్న నాల్గవ తరగతి ఉద్యోగులు, పేషెంట్ కేర్ టేకర్‌లు, పారిశుద్య సిబ్బందికి రోజుకు రూ. 300 చొప్పున ఇన్సెoటివ్ ఇవ్వనున్నట్లు తెలిపి ఇది నెలలో 15 రోజులు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. డిమాండ్లు పాక్షికంగానైనా నెరవేరినందుకు తక్షణం సమ్మెను విరమించి విధుల్లో చేరుతున్నట్లు వారంతా ప్రకటించారు.


Next Story

Most Viewed