గేమర్ల టిక్‌టాక్.. ఫోర్ట్‌నైట్

by  |
గేమర్ల టిక్‌టాక్.. ఫోర్ట్‌నైట్
X

టిక్ టాక్ నిషేధంతో మిలియన్ల మంది వినియోగదారులు తమ రోజువారీ టైమ్‌పాస్ కోల్పోవడమే కాకుండా కొందరు పాపులర్ టిక్‌టాకర్లు కూడా తమ ఉపాధిని కోల్పోయారు. సరిగ్గా ఇలాంటిదే గేమర్‌ల విషయంలోనూ జరిగింది. ఫోర్ట్‌నైట్ అనే పాపులర్ గేమ్‌ను కొన్ని వాణిజ్య కారణాల దృష్ట్యా ఆపిల్ ఐస్టోర్, గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించారు. అంటే కొత్తగా ఎవరైనా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నా, అధికారిక అప్‌డేట్ పొందాలన్నా పొందలేరు. అయితే ఫోర్ట్‌నైట్‌ను తయారు చేసిన ఎపిక్ గేమ్స్ నుంచి ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నప్పటికీ కమ్యూనికేషన్‌లో కొద్దిగా గ్యాప్ వచ్చే సమస్యలు ఉన్నాయి. కానీ ఫోర్ట్‌నైట్ మీద ఆపిల్ సంస్థ చూపించిన ధోరణిని, చిన్నచూపును యంగ్ గేమర్‌లు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయమై ఫోర్ట్‌నైట్ తీసుకుంటున్న చర్యలను వారు సమర్థిస్తున్నారు. మరి ఫోర్ట్‌నైట్ ఎందుకింత ఫేమస్?

భారతీయులకు బాగా సుపరిచితమైన పబ్జీ ఆటలాగే ఉంటుంది. కానీ ఇందులో ఒకరినొకరు చంపుకోవడంతో పాటు జాంబీలను, విలన్‌లను చంపుతూ కొన్ని వస్తువులను రక్షించాలి. వాటిని రక్షించడానికి ఫోర్ట్‌లు నిర్మించవచ్చు. 2017లో ఎపిక్ గేమ్స్ సంస్థ వారు ఈ ఆన్‌లైన్ గేమ్‌ను విడుదల చేశారు. ఇది మూడు విభిన్న విధానాల్లో అందుబాటులో ఉంది. ‘ఫోర్ట్‌నైట్ : సేవ్ ద వరల్డ్, ఫోర్ట్‌నైట్ బ్యాటిల్ రాయలే, ఫోర్ట్‌నైట్ క్రియేటివ్’. వీటిలో సేవ్ ద వరల్డ్ మాత్రం డబ్బులు చెల్లించి ఆడాలి. ఫోర్ట్‌నైట్ గేమ్‌ను ఆడటం సంగతి పక్కన పెడితే ఎవరైనా ఆడుతుంటే చూడటం భలే మజాగా అనిపిస్తుంది. అందుకే యూట్యూబ్ గేమింగ్‌లో ఈ గేమ్ స్ట్రీమింగ్‌లే ఎక్కువగా ఉంటాయి. ఇలా తాము ఆడుతున్న గేమ్‌ను స్ట్రీమ్ చేసుకుంటూ లక్షల్లో డబ్బు సంపాదించిన యువకులు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా లాక్‌డౌన్ సమయంలో బయట తిరగకుండా ఇంటికే పరిమితమైన పిల్లలకు ఈ ఫోర్ట్‌నైట్‌ను మించిన టైమ్‌పాస్ లేదు. ఈ గేమ్ ముఖ్యంగా అమెరికా, ఇండియా దేశాల్లో చాలా పాపులర్. ఒక్కసారి గేమ్ ఆడటానికి కూర్చొని 10 గంటల పాటు నిరంతరాయంగా ఆడినా సరే, కుర్చీలో నుంచి లేవని పిల్లలు కూడా ఉన్నారు. అంతలా వ్యసనంగా మారింది కాబట్టే ఈ గేమ్‌ను ప్లేస్టోర్, ఆపిల్ స్టోర్‌లు డిలీట్ చేసినందుకు అందరికీ కోపం వచ్చింది. అందుకే దీన్ని గేమర్‌ల పాలిట టిక్‌టాక్‌గా అభివర్ణిస్తారు.


Next Story