యాగ్జిలరీ ప్రమోషన్లతో పోలీసుల్లో నైరాశ్యం…

by Sridhar Babu |

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: భూజాన తుపాకీ, వీపుకు కిట్ బ్యాగ్ అడవుల్లో గాలించడమే లక్ష్యంగా పనిచేస్తారు కొంతమంది పోలీసులు. అన్నల ఇలాఖాలోకి వెల్లేప్పుడు తమ వెంట తీసుకెళ్లే ఆహారం ఎన్ని రోజులు వస్తుందో వారికి తెలియదు, ఎన్ని రోజులకు ఇంటికి చేరుతామో అంతకన్నా తెలియదు. మృత్యువుతో సాహవాసం చేస్తూ ప్రాణాలతో బయటపడతామో లేదోనన్న ఆందోళనతో సాగుతుంటుంది మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కంటి మీద కునుకు లేక&#8230; వందల మైళ్లు నడుచుకుంటూ తిరుగాడే [&hellip;]</p>

police kumbing 1
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: భూజాన తుపాకీ, వీపుకు కిట్ బ్యాగ్ అడవుల్లో గాలించడమే లక్ష్యంగా పనిచేస్తారు కొంతమంది పోలీసులు. అన్నల ఇలాఖాలోకి వెల్లేప్పుడు తమ వెంట తీసుకెళ్లే ఆహారం ఎన్ని రోజులు వస్తుందో వారికి తెలియదు, ఎన్ని రోజులకు ఇంటికి చేరుతామో అంతకన్నా తెలియదు. మృత్యువుతో సాహవాసం చేస్తూ ప్రాణాలతో బయటపడతామో లేదోనన్న ఆందోళనతో సాగుతుంటుంది మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కంటి మీద కునుకు లేక… వందల మైళ్లు నడుచుకుంటూ తిరుగాడే వారికి పదోన్నతులు కల్పించే విషయంలో సరైన న్యాయం జరగడం లేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. డిసిప్లేనరీ డిపార్ట్ మెంట్ కావడంతో తమ బాధను చెప్పుకోలేక, పదోన్నతి రాలేదన్న ఆక్రందనను వెలిబుచ్చలేక కాలం వెల్లదీస్తున్నారు కొన్ని విభాగాల్లోని పోలీసులు.

యాగ్జిలరీ ప్రమోషన్లపై….

నక్సల్స్ ఏరివేతలో పనిచేసే పోలీసులకు యాగ్జిలరీ ప్రమోషన్లు ఇచ్చే ప్రక్రియ అమలవుతోంది. సీనియారిటీని పక్కనపెట్టి నక్సల్స్ ను ఎన్ కౌంటర్ లలో హతం చేసిన వారికి ఈ విధానంలో పదోన్నతులు కల్పిస్తుంటారు. ఇందుకోసం సంబంధిత జిల్లాలకు చెందిన ఎస్పీలు, లేదా సీపీల ద్వారా సైటేషన్ పంపించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసిన ఈ జాబితాతో పాటు ఆయా కేడర్ ల పోలీసుల వ్యక్తిగతంగా పనిచేసిన తీరును వివరిస్తూ ఓ పైల్ తయారు చేసి డిపార్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)కి పంపిస్తారు. డీపీసీ ఫైనల్ చేసిన వారికే ప్రమోషన్లకు క్లియరెన్స్ వస్తోంది. అయితే ఇందులో ఫిజికల్ గా కష్టపడుతున్న వారికి కాకుండా కమ్యూనికేషన్స్ వ్యవస్థపై నిఘా వేసి సమాచారం చేరవేస్తున్న వారికి ఎక్కువ ప్రాదాన్యత లభిస్తుండడం చాలా మంది పోలీసులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. అడవుల్లో తిరుగుతూ ఫీల్డ్ వర్క్ చేస్తున్న వారికి తక్కువ ప్రయారిటీ లభిస్తుండడమే వారి నైరాశ్యానికి కారణమని తెలుస్తోంది.

తాజాగా 43 మందికి…

ఈ నెల 7న యాగ్జిలరీ ప్రమోషన్ల జాబితాను విడుదల చేశారు. ఇందులో మొత్తం 43 మందికి పదోన్నతులు కల్పించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇందులో కొంతమంది ఫీల్డ్ లోకి రాకుండానే యాగ్జిలరీ కొట్టేశారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. కొన్ని విభాగాల వారికి ప్రత్యేకంగా టెక్నాలజీ కోసం నిధుల కేటాయింపు కూడా పెద్ద ఎత్తున ఉంటోంది. వీరు తమ కార్యాలయాలకే పరిమితం అయి మావోయిస్టుల కదలికలపై నిఘా వేసి గ్రౌండ్ లెవల్ పోలీసులను రంగంలోకి పంపుతుంటారని సమాచారం. ఫీల్డ్ లెవల్లో పని చేసే వారికి టెక్నాలజీని వినియోగించి అలెర్ట్ చేసే వారికి సమ ప్రాధాన్యత కల్పించడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందన్న మానసిక వేదనకు గురువుతున్నారు కొంతమంది పోలీసులు. ఇటీవల కాలంలో భద్రాద్రి, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు ముమ్మరం కాగానే వారిని కట్టడి చేయడంలో బార్డర్ ఏరియా పోలీసులు ఎప్పటికప్పుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

సెక్యూరిటీ విషయంలోనూ… వివక్షేనా..?

మావోయిస్టులను ఏరివేసే విషయంతో పాటు ఆస్థుల పరిరక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వారికి యాగ్జిలరీ ప్రమోషన్లలో ప్రాధాన్యత కల్పించకపోవడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కంటికి రెప్పలా బందోబస్తు నిర్వహించారు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని మావోయిస్టుల కదలికలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్భందీగా బందోబస్తు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువు పట్టుగా మారిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఎటువైపు నుండి మావోయిస్టులు దాడి చేస్తారోనన్న భయంతోనే గస్తీ నిర్వహించారు. లెఫ్ట్, రైట్ బ్యాంక్ లతో పాటు ఇక్కడ పనిచేసిన ఇంజనీర్లు, వచ్చిపోయే వీఐపీలు, స్థానికంగా ఉన్న టార్గెట్లను రక్షించడంలో సఫలం అయినప్పటికీ పదోన్నతులు కల్పించే విషయంలో ప్రాధాన్యత కల్పించలేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. యాగ్జిలరీ ప్రమోషన్ల విషయంలో ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాల్సిన అవసరం ఉందన అభిప్రాయాలు పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Next Story