వలస పక్షులు అలా ఎందుకు చేశాయి.. కారణం ఏంటి?

by  |
వలస పక్షులు అలా ఎందుకు చేశాయి.. కారణం ఏంటి?
X

దిశ, ఫీచర్స్ : కాలాలు, సీజన్లను బట్టి పక్షులు ఒక చోటు నుంచి మరొక చోటుకు వలస వెళ్తాయన్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని గుడ్లు పొదిగేందుకు అనువైన ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్తే, మరికొన్ని ఆహార వేటతో పాటు అనువైన ఆవాసాల కోసం మైగ్రేట్ అవుతుంటాయి. అయితే తాజాగా దక్షిణ కాలిఫోర్నియాలోని పక్షుల స్థావరాలున్న ఓ ఐలాండ్‌లో డ్రోన్ క్రాష్ అవడంతో బెదిరిపోయిన ఎలిగెంట్ టర్న్ బర్డ్స్ దాదాపు 3వేల గుడ్లను వదిలేసి వెళ్లిపోయాయి.

గత నెలలో హంటింగ్టన్ బీచ్‌లోని బోస్లా చికా ఎకోలాజికల్ రిజర్వ్ మీదుగా రెండు డ్రోన్లు విహరించగా, అందులో ఒకటి అక్కడి చిత్తడి నేలల్లో కూలిపోయింది. దీంతో వేటగాళ్లు దాడిచేస్తారనే భయంతో పక్షులు అక్కడి నేలల్లోని తమ గూళ్లను వదిలేసి వెళ్లిపోయినట్టు ఆ దేశ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అయితే ఈ నెలలోనే అవి గుడ్లను పొదగనుండగా, ప్రస్తుతం బీచ్‌లోని ఇసుక గూళ్లన్నీ ఎలిగెంట్ బర్డ్స్ గుడ్లతో కనిపిస్తున్నాయి.

కాగా 160 కిమీల శాన్ డిగో తీర ప్రాంతంలో పక్షులు ఇంత భారీ స్థాయిలో గుడ్లను వదిలేసి వెళ్లడం చాలా అరుదని రిజర్వ్ మేనేజర్ మెలీసా లోబ్ తెలిపారు. పాండమిక్ పరిస్థితుల కారణంగా చాలా మంది అవుట్ డోర్ ప్రదేశాల్లో గడిపేందుకు ఇష్టపడుతుండటంతో గతేడాది ఈ ప్రదేశానికి లక్ష మంది పర్యాటకులు రాగా, ఈ సారి ఆ సంఖ్య మరో 60 వేలు పెరిగిందన్నారు. ఇది డ్రోన్ యాక్టివిటీతో పాటు ఇక్కడి ట్రాక్స్‌పై కుక్కలు, సైకిళ్ల సంచారం పెరిగేందుకు కారణం కాగా, వాటిపై నిషేధం విధించినట్టు తెలిపారు.

ఇక ఇక్కడి చిత్తడి నేలలను పట్టించుకోకుండా రిజర్వ్‌కు నార్త్ ఎండ్‌లోని కొండ ప్రాంతాల్లో మల్టీమిలియనీర్స్ విలాసవంతమైన ఇండ్లను నిర్మించుకుంటున్నారు. వీరిలో చాలామంది తీరప్రాంతంలోని సున్నిత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటుండగా, కొందరి అవగాహనారాహిత్యం వల్ల పక్షుల జీవనానికి ఆటంకం కలుగుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ బోల్సా చికా తీర ప్రాంతంలోని చిత్తడి నేలలు 1500 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. 800 రకాల మొక్కలు, వన్య ప్రాణులకు ఇది ఆలవాలంగా నిలుస్తోంది.



Next Story

Most Viewed