ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో సెరేనా‌కు షాక్

by  |

దిశ, స్పోర్ట్స్ :ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌‌లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. ఓపెన్ ఎరాలో 24వ గ్రాండ్ స్లామ్ సాధించి ఆల్‌టైం దిగ్గజం మార్గరెట్ కోర్ట్ సరసన చేరాలని భావించిన సెరేనా విలియమ్స్‌కు షాక్ తగిలింది. ఆదివారం రోలాండ్ గారోస్‌లో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 3-6, 5-7 తేడాతో 21వ సీజ్ ఎలేనా రిబకీనా చేతిలో పరాజయం పాలైంది. కజకిస్తాన్‌కు చెందిన 21 ఏళ్ల ఎలేనా మ్యాచ్ మొదటి నుంచి సెరేనాపై ఆధిపత్యం ప్రదర్శించింది.

మొదటి సెట్ 31 నిమిషాల్లో గెలుచుకున్న ఎలేనా రెండో సెట్‌లో కాస్త తడబడింది. 4-5 తేడాతో వెనుకబడి ఉన్న సమయంలో వరుసగా మూడు పాయింట్లు సాధించింది. దీంతో సెరేనా రికార్డు గ్రాండ్‌స్లామ్‌ల కలకు ప్రీ క్వార్టర్స్‌లోనే తెరపడింది. మరో ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో 15వ ర్యాంకర్ విక్టోరియా అజరెంక 7-5, 3-6, 2-6 తేడాతో పవ్లీచెంకోవా చేతిలో ఓడిపోయింది. తొలి సెట్‌లో గెలిచిన తర్వాత అజరెంక తన స్థాయికి తగిన ఆట ప్రదర్శించలేదు. దీంతో పవ్లీచెంకోవా సునాయాసంగానే మిగిలిన రెండుసెట్లు గెలుచుకొని క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అన్‌సీడెడ్ బడోసా గిల్బర్ట్, జిదాన్‌సెక్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్‌..

పురుషుల సింగిల్స్‌లో 2వ ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ 6-2, 6-1, 7-5 తేడాతో 22వ ర్యాంకర్ క్రిస్టియన్ గార్నిన్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 5వ ర్యాంకర్ స్టెఫానీ సిట్సిపాస్ 6-3, 6-2, 7-5 తేడాతో పాబ్లో బుస్తాపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఫెదరర్ తప్పుకోవడంతో 9వ సీజ్ బెర్రెట్టినీకి వాకోవర్ లభించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story