మే నెలలో రూ. 1,730 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడుల ఉపసంహరణ

by  |
మే నెలలో రూ. 1,730 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడుల ఉపసంహరణ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా మదుపర్ల సెంటిమెంట్ దెబ్బ తినడంతో వరుసగా రెండో నెలలో భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) వెనక్కి వెళ్లాయి. మే నెలలో భారత మార్కెట్ల నుంచి దాదాపు రూ. 1,730 కోట్ల ఉపసంహరణ జరిగింది. ఏప్రిల్‌లో భారత మార్కెట్ల నుంచి(ఈక్విటీ, డెబ్ రుణాలు రెండూ) మొత్తం రూ. 9,435 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. మేలో విదేశీ పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 3,375.2 కోట్లను ఉపసంహరించుకోగా, డెబ్ విభాగంలో మాత్రం రూ. 1,645.8 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

దీంతో మొత్తం నికరంగా రూ. 1,729.4 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని గణాంకాలు పేర్కొన్నాయి. ‘వరుసగా ఎనిమిది వారాలపాటు గణనీయంగా పెట్టుబడులు వెనక్కి వెళ్లిన తర్వాత, గత రెండు వారాలుగా పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతున్నాయని’ మార్నింగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడుల ఉపసంహరణ కనబడుతోందని కోటక్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.


Next Story

Most Viewed