‘ఇందిరమ్మ విచారణలో ప్రభుత్వ జోక్యం’

by  |
‘ఇందిరమ్మ విచారణలో ప్రభుత్వ జోక్యం’
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అవినీతి వ్యవహారంలో ప్రభుత్వం సహకరించకపోవడం కారణంగానే సీఐడీ విచారణ నిలిచిపోయినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి విమర్శించారు. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణ ముగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసులో అక్రమార్కులపై వెంటనే చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కోరారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో 1083 నుంచి 2004 నాటికి 16.3 లక్షల ఇండ్లు, ఆ తర్వాత 2004 నుంచి 2014 నాటికి 23.1 లక్షల ఇండ్లు పూర్తయినట్టు తెలిపారు. అయితే, 2009లో ప్రభుత్వం చేపట్టిన విచారణలో 1.95 లక్షల ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టుగా తేలిందన్నారు.

నిర్మాణం చేయని ఇండ్లకు, పాత ఇండ్లకు బిల్లులు చెల్లించడమే కాకుండా, అనర్హులకు ఇండ్లు కేటాయించడం తదితర అక్రమాలు భారీ స్థాయిలో చోటు చేసుకున్నట్టు తెలిపారు. ఈ మొత్తంలొ రూ.235.90 కోట్లు అవినీతి జరిగినట్టుగా విచారణ కమిటీ తేల్చిందన్నారు. ఈ నేపథ్యంలో గృహనిర్మాణ కుంభకోణానికి 508 ఉద్యోగులకు సంబంధం ఉన్నట్టు తేలగా, అందులో 150 మంది ఉద్యోగులు సస్పెండ్ కాగా, 68 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు తెలిపారు. ఇదే కేసులో 294 మంది ఎంపీపీ, సర్పంచ్‌లతో పాటు అనధికారులపై 179 క్రిమినల్ కేసులు నమోదయినట్టు చెప్పారు. అయితే, అక్రమాలు చోటు చేసుకున్న రూ.235.90 కోట్ల సొమ్మును లబ్దిదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం భావించినా.. నేటి వరకూ ఒక్క పైసా కూడా వసూలు చేయలేదని విమర్శించారు.

విచారణ ముగింపునకు యత్నం..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఇందిరమ్మ ఇండ్ల అవినీతిపై సమగ్ర విచారణ జరిపించేందుకు 2014 జూలై 26న ఈ కేసును సీఐడీకి అప్పగించినట్టు తెలిపారు. ఎంతో నిబద్దతతో మొదలు పెట్టిన సీఐడీ విచారణలో 36 గ్రామాల్లో 22 వేల ఇండ్లను తనిఖీ చేయగా.. నిర్మాణం చేయకుండానే 1022 ఇండ్లకు, 1454 పాత ఇండ్లకు బిల్లులు చెల్లించినట్టు తేలిందన్నారు. ఈ కేసులో సీఐడీ మొత్తం 9 కేసులు నమోదు చేసిందన్నారు. అయితే, 2016లో నిర్మాణం చేసిన ఇండ్ల వయస్సు నిర్థారించేందుకు ఇంజనీర్ల సహాయం కావాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరగా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలకు పాల్పడిన గ్రామ, మండల స్థాయి నాయకులు అంతా కూడా పార్టీ పిరాయింపులతో అధికార పార్టీలో చేరడంతో సీఐడీ విచారణ నిలిచినట్టు ధ్వజమెత్తారు. 2009 వరకూ రూ.238.9 కోట్ల అక్రమాలతో పాటు రూ.2009 నుంచి 2014 వరకూ ఇంకా పెద్ద ఎత్తున వందల కోట్ల అవినీతి జరిగిందని పద్మనాభరెడ్డి ఆరోపించారు.

అయితే, ప్రభుత్వం జోక్యం కారణంగానే సీఐడీ విచారణ నిలిచినట్టు ఆయన విమర్శించారు. సమగ్ర విచారణకు ప్రభుత్వం జీవో విడుదల చేసి 7 ఏండ్లు గడిచినా.. ఇంత వరకూ విచారణ పూర్తి కాలేకపోవడంతో దోషులకు శిక్ష పడలేదన్నారు. దీనికంతటికీ ప్రభుత్వమే బాధ్యత అని అన్నారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు నిర్మిస్తున్న డబుల్ ఇండ్లకు ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే.. డబుల్ ఇండ్లల్లోనూ అక్రమాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలపై సమగ్ర విచారణ పూర్తి చేయాలని, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed