‘దళిత బంధు వద్దు అన్నది మేమే.. ఇప్పుడెందుకు నిలిపివేశారు..?’

by  |
‘దళిత బంధు వద్దు అన్నది మేమే.. ఇప్పుడెందుకు నిలిపివేశారు..?’
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌లో ‘దళితబంధు’ పథకం అమలును కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయడాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక పెద్ద జోక్‌గా అభివర్ణించింది. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో అమలుచేయవద్దని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది తామేనని, కానీ జూలై నెలలో తాము కోరితే ఇప్పుడు నిలిపివేయడం అర్థరహితమని ఫోరమ్ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు తలా రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టరు ఖాతాకు వెళ్ళిపోయాయమని, మరో 17 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి కూడా చేరాయని, ఇప్పుడు ఆ పథకం అమలును ఆపివేయడంలో అర్థమే లేదన్నారు. తాము విజ్ఞప్తి చేసినప్పుడే నిలిపివేసి ఉంటే ప్రయోజనం ఉండేదని, ఓటర్లను ఊరించడానికి ఆస్కారమే ఉండేది కాదన్నారు.

నిజానికి దళితబంధు పథకానికి తాము వ్యతిరేకం కాదని, దీన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, పైగా ఇది దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోడానికి ఉపయోగపడుతుందని, కానీ దీన్ని తీసుకొచ్చిన టైమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని హుజూరాబాద్ మినహా మిగిలిన 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలుచేయాలని తాము ఎన్నికల సంఘానికి సూచించామని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరుగుతున్నందున పోలింగ్ మొత్తం ముగిసిన తర్వాత ఇక్కడ కూడా అమలుచేయాల్సిందిగా సూచించామని తెలిపారు. పైగా రాజకీయ లబ్ధి కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు స్వయంగా ముఖ్యమంత్రే పేర్కొన్నందున ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నందున దీనిపై సత్వరం సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా జూలైలో రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు వివరించారు. నిజానికి ఆగస్టు నెల మొదటి వారంకల్లా నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. ఇప్పటికే డబ్బులన్నీ లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరినందున ఆ పథకం అమలును ఆపినా, ఆపకున్నా ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం ఏ పథకాన్ని అమలుచేసినా ముందుగా మార్గదర్శకాలను జారీచేసిన తర్వాత నిధులను విడుదల చేస్తుందని, కానీ, ఇక్కడ అంతా రివర్స్ పద్ధతిలో తొలుత నిధులు జారీ అయిన తర్వాత గైడ్ లైన్స్ రూపొందించే ప్రక్రియ జరుగుతున్నదని తప్పుపట్టారు. ప్రజా ధనం వ్యర్థమయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వం ఎలాగూ దళితబంధు పథకాన్ని ఆన్ గోయింగ్ స్కీమ్‌గా పేర్కొన్నందున అదే తరహాలో ఇప్పుడు కంటిన్యూ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా ఎంచుకున్న టైమింగ్ మాత్రం సరికాదన్నారు. ఎన్నికల సంఘం భావించినట్లుగా ఈ పథకం ఓటర్లను ప్రభావితం చేస్తుందనుకుంటే ఈ పని ముందే చేయాల్సి ఉందన్నారు. కనీసం ఎన్నికల షెడ్యూలును విడుదల చేసినప్పడైనా దీన్ని నిలిపివేసి ఉంటే అర్థం ఉండేదన్నారు.


Next Story