తాగిన మైకంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య.. నోటీసు వల్లే అంటున్న రైతులు

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-23 09:35:29  IST  )

<p>దిశ ప్రతినిధి, మెదక్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మాజీ గ్రామ సర్పంచ్, నిమ్జ్ భూ బాధితుల పోరాట కమిటీ నాయకుడు మోహన్ రెడ్డి(50) సోమవారం నారింజ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గత కొంత కాలంగా మోహన్ రెడ్డి మద్యానికి బానిసగా మారాడు. మోహన్ రెడ్డి [&hellip;]</p>

తాగిన మైకంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య.. నోటీసు వల్లే అంటున్న రైతులు
X

దిశ ప్రతినిధి, మెదక్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మాజీ గ్రామ సర్పంచ్, నిమ్జ్ భూ బాధితుల పోరాట కమిటీ నాయకుడు మోహన్ రెడ్డి(50) సోమవారం నారింజ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..

గత కొంత కాలంగా మోహన్ రెడ్డి మద్యానికి బానిసగా మారాడు. మోహన్ రెడ్డి ఆదివారం నాడు కూతురు లక్ష్మి స్వగ్రామమైన ఖలీల్‌పూర్ గ్రామానికి వెళ్ళాడు. రాత్రి కూతురు ఇంట్లోనే ఉండి సోమవారం తెల్లవారుజామున ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లి తాగిన మైకంలో నారింజ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు హద్నూర్ ఎస్‌ఐ వినయ్ కుమార్ వివరించారు. మృతుడికి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఒకే ఒక్క కూతురు ఉందన్నారు. మృతుడి భార్య వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవ పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎ‌స్‌ఐ తెలిపారు. కాగా మోహన్ రెడ్డి నిమ్జ్ లో భూమి పోతుందన్న బెంగతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు టీజేఎస్ నియోజకవర్గ కన్వీనర్ మొగుడంపల్లి ఆశప్ప ఆరోపించారు.

నిమ్జ్ భూతంలా మారింది.

జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ పెద్ద భూతంలా తయారైందని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయంపైనే ఆధారపడ్డ తమకు వేరే జీవనాధారం లేదని, ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. గతంలో కూడా కాశప్ప అనే రైతు మనస్తాపంతో మృతి చెందాడన్నారు. ఆర్డీఓ మోహన్ రెడ్డికి నోటీసు ఇవ్వడం వల్లే మోహన్ రెడ్డి మనస్తాపం చెంది తమకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. కొంతమంది మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో తెల్ల కాగితంపై సంతకం తీసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని, నిమ్జ్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని వారు కోరారు.

Next Story