ఫ్లాష్ ఫ్లాష్ : ఈటలకు అస్వస్థత.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

by  |
etala-rajender-sick
X

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో 12 రోజులుగా పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు పాదాలకు బొబ్బలు రావడంతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈనెల 19న ప్రారంభమైన పాదయాత్ర నేటితో 12వ రోజుకు చేరుకున్నది. కమలాపూర్, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో పూర్తయిన పాదయాత్ర వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్నది. అక్కడ మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఈటల అస్వస్థతకు గురికావడంతో జమ్మికుంట వైద్యులు అక్కడకు చేరుకొని పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం ఆయన్ను మరిన్ని పరీక్షల కోసం నిమ్స్ ఆస్పత్రికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటల పాదయాత్ర ఆగిపోయినట్లు సమాచారం. ఇప్పటివరకు 70 గ్రామాల్లో 222 కిలోమీటర్ల మేర పాదయాత్రను ఈటల కొనసాగించారు. 23 రోజుల పాటు కొనసాగించాల్సిన పాదయాత్ర వీణవంక, హుజురాబాద్ మండలాల్లో కొనసాగాల్సి ఉన్నది. ఈటల పూర్తిగా కోలుకున్నాక తిరిగి ఆదివారం నుండి యధావిధిగా పాదయాత్ర కొనసాగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, ఈటల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.


Next Story

Most Viewed