టీఆర్ఎస్‌పై మరో బాంబు పేల్చిన మాజీ మేయర్ రవీందర్ సింగ్

by  |
టీఆర్ఎస్‌పై మరో బాంబు పేల్చిన మాజీ మేయర్ రవీందర్ సింగ్
X

దిశ, కరీంనగర్ సిటీ : ఉద్యమ పార్టీగా ఆరంభమై రాష్ట్రంలో అధికార పార్టీగా చెలామణి అవుతున్న టీఆర్ఎస్ పతనం ‘నా రాజీనామా’తోనే మొదలైందని ఆ పార్టీ సీనియర్ నేత నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. శనివారం నగరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీతి, నిబద్ధత, నిజాయితీ అనే ట్యాగ్‌లైన్‌తో టీఆర్ఎస్‌లో చేరి ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకువెళ్లటంలో ఎంతగానో కృషి చేసినట్లు వెల్లడించారు. 2006 లో అప్పటి ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌తో అర్జున గుట్టకు వెళ్లిన సందర్బంగా ఆ దేవుడి సాక్షిగా తనకు ఎమ్మెల్సీ అవకాశమిస్తానని చెప్పారని, మరో మూడు సందర్భాల్లో కూడా తాను అడగకున్నా హామీ ఇచ్చినట్టు గుర్తుచేసుకున్నారు.

ఇప్పుడు వాటిని గుర్తు చేస్తే పొమ్మనలేక పొగబెట్టి, బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ ద్రోహులకే పెద్దపీట వేస్తూ ఉద్యమకారులను పట్టించుకోవటం లేదన్నారు. నా నామినేషన్ కూడా తిరస్కరించే కుట్రలు చేసినపుడే నైతిక విజయం సాధించానన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించిన వారి ఇంటి ముందు కూడా పోలీసులను మోహరింపజేసి, భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. మేయర్ పదవి అడగలేదని, ఎమ్మెల్సీ మాత్రమే అడగగా, ఈ సారి నీకేనంటూ చెప్పి మోసం చేయటంతోనే స్వతంత్రంగా బరిలోకి దిగినట్లు స్పష్టం చేశారు. మేయర్‌గా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు, రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి, దేశంలోనే గుర్తింపు తెచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ సిటీ కోసం ఎంతగానో శ్రమించి నిధులు తెస్తే, నాసిరకం పనులతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఘనత అధికార నేతలదేనని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిలో భానుప్రసాద్ రావు గురించి అందరికీ తెలుసని.. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉన్న 12 ఏళ్లలో ఎన్ని సార్లు జిల్లాలో స్థానిక సంస్థల సమస్యలపై ఉద్యమించాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏనాడు స్థానిక సంస్థల అభివృద్ధి, ప్రాదేశిక సభ్యుల సమస్యలు పట్టించుకోని భాను ప్రసాద్ ఏ ముఖంతో ఓట్లడుగుతాడని ధ్వజమెత్తారు. వాళ్ళు గెలిస్తే హైదరాబాద్‌కే పరిమితమైతారని, తమ వ్యాపారాల అభివృద్ధి కోసమే పదవిని ఉపయోగించుకుంటారని విమర్శించారు. నేను గెలిస్తే కరీంనగర్‌లో కార్యాలయం ఏర్పాటు చేసి, ప్రాదేశిక సభ్యులకు ఆరోగ్య కార్డులు అందించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో పదవులు కేటాయిస్తున్నట్టు చెబుతున్న ముఖ్యమంత్రి, ఉద్యమ కాలంలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఆందోళనలు చేశారా? అని ప్రశ్నించారు. పదవులకు పాకులాడేదెవరో ప్రజలకు తెలుసని, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ కవితకు ఓడిపోయిన వెంటనే పదవులు కట్టబెట్టడం అందరికీ తెలిసిందేనన్నారు. ఉద్యమానికి ముందు కూడా తాను ప్రజాప్రతినిధిగా గెలిచిన విషయం గుర్తుచేశారు. ప్రజలు కలలు గన్న తెలంగాణగా మారాలంటే ఉద్యమకారులు ప్రజాప్రతినిధులవుతేనే, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎన్ని డబ్బులిచ్చినా తీసుకుని, నిరంతరం ప్రజలతో కలిసి వుండే తనకు ఓటు వేయాలని కోరారు. టీఆర్‌ఎస్ ఏతర పార్టీలన్నీ తనకే మద్దతు తెలిపాయన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.సమావేశంలో పలువురు మండల ప్రాదేశిక సభ్యులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed