న్యాయం చేయాల్సిన వ్యవస్థే నాది అంటే ఎలా..?

by  |
న్యాయం చేయాల్సిన వ్యవస్థే నాది అంటే ఎలా..?
X

దిశ‌ప్రతినిధి, నల్లగొండ : హరితహారం పేరులో పేదలభూముల్లోకి వెళ్లి అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు. ఏండ్ల క్రితమే ఈ భూమిని తమకు ప్రభుత్వం పంపిణీ చేసిందని, అందుకు సంబంధించిన పట్టాలను సైతం వారు చూపిస్తున్నా అధికారులు వినిపించుకోవడం లేదు. వీరికి రైతుబంధు వస్తున్నా అధికారులు మాత్రం ఆ భూమి అటవీ‌శాఖదేనంటూ రైతులను గెంటించే ప్రయత్నాలు చేస్తుంటడం గమనార్హం.

భూమి లేని పేదవాళ్లను దృష్టిలో పెట్టుకుని వారు సాగు చేసుకునేందుకు ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వాలు అసైన్డ్ చేశారు. అనంతరం ఆ భూములపై వారికి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వాలు పట్టాలిచ్చాయి. తీరా ఇప్పుడు హరితహారం పేరుతో అటవీశాఖ ఆ భూమిని లాగేసుకుంటోంది. యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన రైతులు సుమారు వందేండ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. ఈ భూమిని గత ప్రభుత్వాలు గ్రామంలోని కొంతమంది రైతులకు కేటాయించాయి. వారికి పట్టా పుస్తకాలు సైతం అందించాయి. ప్రస్తుతం వారికి రైతు బంధు పథకం వర్తిస్తోంది. కానీ ఇటీవల ఆ భూముల చుట్టూ అటవీశాఖ అధికారులు కంచె వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై అధికారులను రైతులు ప్రశ్నించినా వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లభించడం లేదు. ఇన్నేండ్లుగా ఆ భూమిపైన ఆధారపడిన కుటుంబాలు నేడు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన రైతులు ఇటీవలే తుర్కపల్లిలో ధర్నా సైతం చేపట్టారు.

జంగాల గూడెంలోనూ..

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జంగాల గూడెం వద్ద సర్వే నెంబర్ 38లోని దాదాపు 113 ఎకరాలు చెరువు శిఖం భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొంత స్థలం ప్రభుత్వ భవనాల కోసం కేటాయించగా… మిగిలిన భూములను జంగాల గూడెం వాసులు కొన్నేండ్లుగా సాగు చేసుకుంటున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించేందుకు అక్కడికి వెళ్లారు. తమ తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని లాక్కుంటే తాము ఊరుకోబోమని బాధితులు పురుగులమందు డబ్బాలతో నిరసన చేపట్టి సర్వేను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శిఖం భూమిని తమకు పట్టా చేసి ఇవ్వాలని పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60 ఎకరాల భూమిని తలా కొంత సాగు చేసుకుంటూ బతుకీడుస్తున్నామన్నారు. తమ జీవనాధారాన్ని లాక్కుని అడువులు పెంచటం వల్ల తాము అన్యాయమైపోతామని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ శిఖం భూములుగా గుర్తించి హరితహారం కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం తాము సర్వే చేస్తున్నట్టు చెబుతున్నారు. సీఎం​తో సహా పలువురు నేతలు ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

లక్కారంలో పెట్రోల్ బాటిళ్లతో నిరసన..

యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 50లోని దళిత భూములను అటవీ అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇవి ప్రభుత్వ భూములు. తాతల కాలంలోనే అప్పటి ప్రభుత్వాలు ఆ భూములను వీరికి కేటాయించాయి. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లక్కారం సమీపంలో తంగేడు వనాన్ని ఏర్పాటు చేపట్టింది. అందుకు కావాల్సిన భూములతో పాటు హరితహారం కోసం భూముల అవసరం ఏర్పడటంతో ఆ భూములను ఖాళీ చేయాలంటూ అధికారులు వారికి నోటీసులు పంపించారు. ఎందుకని రైతులు ప్రశ్నిస్తే.. అది అటవీశాఖకు చెందిన భూమంటూ చెప్పుకొచ్చారు. వాస్తవానికి అది రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉంది. ప్రభుత్వ భూమి కావడంతో రైతులకు అసైన్డ్ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు సైతం వారికిచ్చారు. కానీ ప్రస్తుతం అటవీశాఖ అవేం పట్టించుకోకుండా హరితహారం మొక్కలు నాటేందుకు ఈ భూమిని ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపింది. దీంతో రైతులు పెట్రోల్ బాటిళ్లతో అటవీశాఖ కార్యాలయం ఎదుట యూకుమ్మడిగా నిరసన చేపట్టారు. ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతరం ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో తాత్కాలికంగా ఆ భూములకు సంబంధించిన వివాదం పెండింగ్‌లో పడింది.

తుంబావి తండాలోనూ అదే పరిస్థితి

యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని తుంబావి తండాలోని 273 సర్వే నెంబరులోని భూమిని చాలా ఏండ్ల క్రితమే గిరిజనుల ఇండ్ల కోసం రెవెన్యూ శాఖ పట్టాలు ఇచ్చింది. కానీ తాజాగా అధికారులు ఆ భూమి అటవీశాఖకు చెందిందంటూ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. దీన్ని గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరకు అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా పనులు నిలిపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెవెన్యూ శాఖ ఇండ్ల కోసం తమకు ఇచ్చిన పట్టాలకు సంబంధించిన భూమి ఎక్కడ ఉందో చెప్పాలంటూ రైతులు నిలదీస్తున్నారు. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అటవీశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



Next Story

Most Viewed