మా ఆశలు చిగురిస్తున్నయ్

by  |
మా ఆశలు చిగురిస్తున్నయ్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండటంతో శ్రీశైలం తో పాటు సాగర్ ప్రాజెక్టుకు సైతం వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతోంది. అనుకున్న దానికంటే ముందస్తుగానే వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. సాగర్ నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది. రెండు మూడు రోజులుగా వరద నీరు సాగర్ ప్రాజెక్టులోకి చేరుతుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు మొదలుకావడం వల్ల నీరు విడదలవుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం గతేడాది కంటే ఈ ఏడాది ముందుగానే రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది వర్షాలు సమృద్దిగా కురవడంతో పలుమార్లు ప్రాజెక్టు గేట్లను సైతం తెరిచారు. గతేడాదితో పోలిస్తే 40 టీఎంసీల నీరు ప్రాజెక్టులో అధికంగా ఉంది. ప్రస్తుతం కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తున్నందున త్వరగా ప్రాజెక్టు నిండుతుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది కంటే ఎక్కువ?

నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులుగా ఉంది. మొత్తం నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయంలోకి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోలు సమానంగా 500 క్యూసెక్కులుగా నమోదువుతున్నది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం అధికంగా ఉంటే ఈ సారి సాగర్ జలాశయానికి వరద తాకిడి గతేడాది కంటే ముందుగా రావొచ్చని నీటి పారుదలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

22 లక్షల ఎకరాలకు పైగా సాగు..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఐదు జిల్లాల్లో కలిపి 22.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కుడి కాల్వ కింది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 6.68 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 4.43 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ కింద తెలంగాణలోని నల్లగొండ జిల్లా 3.72 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 3.46 లక్షల ఎకరాలు, ఏపీలోని కృష్ణాజిల్లాలో 4.04 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో దాదాపుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడి 7.18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. నాగార్జునసాగర్ జలాశయం వరద నీటికి శ్రీశైలం జలాశయమే పెద్ద దిక్కు. శ్రీశైలం ప్రాజెక్టుపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద నీరు ఆధార‌పడి ఉంది. శ్రీశైలం జలాశయానికి పులిచింతల ప్రాజెక్టుకు ఉన్నన్నీ ఉపనదులు సాగర్ జలాశయానికి లేవు. చుట్టుపక్కల కురిసిన వర్షానికి సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చే అవకాశం ఎక్కువగా లేదు. డిండి వాగు, ఉప్పాగు, మైనంపల్లివాగులు మినహా సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చే పరిస్థితులు లేవు. దీంతో సాగర్ ప్రాజెక్టు కేవలం శ్రీశైలం జలాశయంపైనే ఆధారపడాల్సి వస్తుంది.


Next Story