రామగుండంలో తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం..

by  |
రామగుండంలో తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా సుమారు 450 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశామని ఎన్‌టీపీసీ సదరన్ రీజియన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో 100 మెగావాట్ల అతిపెద్ద తేలియాడే సౌరవిద్యుత్ కేంద్రాన్ని రామగుండంలో ఏర్పాటు చేయనున్నామని వెల్లడించింది. మే నెలలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్గా నిలవనుంది. కేరళలోని కయంకుళం గ్యాస్ ప్లాంట్‌లో 92 మెగావాట్ల ఫ్లోటింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తుండగా, సింహాద్రి విద్యుత్ ప్లాంట్‌లో 25 మెగావాట్ల యూనిట్ను ఏర్పాటు చేయనుంది.

తమిళనాడులోని టుటికోరిన్ సమీపంలో ఎట్టాయపురంలో 230 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను 2022 నాటికి పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించినా లాక్ డౌన్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. రూ.430 కోట్ల పెట్టుబడితో రామగుండంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. రామగుండంలో 800 మెగావాట్లతో రెండు బొగ్గు ఆధారిత ఉష్ణ విద్యుత్ ప్రాజెక్టులను కూడా అమలు చేసే పనిలో ఉంది. అందులో 800 మెగావాట్ల ఫేజ్-1 పనులు జనవరి 2022 నాటికి, ఫేజ్-2 పనులు మార్చి 2022 నాటికి ప్రారంభం కానున్నాయి.



Next Story