ట్యాంపరింగ్ టెన్షన్.. నకిలీతో అస్లీకి ఫైన్

by  |
ట్యాంపరింగ్ టెన్షన్.. నకిలీతో అస్లీకి ఫైన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ‘లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాను. నా వెహికల్‌ను బయటకు తీయడం లేదు. పార్కింగ్ స్థలంలో వెహికిల్ దుమ్ము పడుతోంది. హెల్మెట్ ధరించలేదని ఫైన్ వేస్తూ ఈ-చలాన్ వచ్చింది. ఆన్‌లైన్‌లో చూస్తే షా‌ద్‌నగర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఉల్లంఘన చేసినట్టు ఉంది. వెహికల్ నెంబర్ కూడా ఒకటే.. ఇది ఫస్ట్ టైం కాదు. ఏప్రిల్ నెల నుంచి ఇలా వస్తున్నాయి. అప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసులకు, వెబ్‌సైట్‌లోనూ కంప్లయింట్ ఇస్తున్నా.. రెండు నెలల నుంచి సమస్యను పరిష్కరిస్తామని చెబుతూనే ఉన్నారు. కొత్త చలాన్లు వస్తూనే ఉన్నాయి. ఎవరో ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసుకుంటే మేమెందుకు ఫైన్లు కట్టాలి..’ అని ప్రశ్నిస్తున్నారు వనస్థలిపురానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి మహేష్..

ఇతనొక్కడే కాదు.. మూడు కమిషనరేట్ల పరిధిలో తమ వెహికిల్ నెంబర్ ప్లేట్లతో వేరే వాహనాలు నడుస్తున్నాయని చాలా మంది వాహనదారులు నెత్తీ, నోరూ బాదుకుంటున్నారు. హెల్మెట్ ధరించకుండా, ర్యాష్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఆ ఏరియా, వెహికల్ నడుపుతున్న వ్యక్తులెవరో కూడా వారికి తెలియదు. మహేష్‌కు చెందిన స్కూటీ (టీఎస్ 08 ఎఫ్‌టీ 3581) మీద రెండు నెలల్లోనే షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే ఐదు ఈ-చలాన్లు జనరేట్ అయ్యాయి. అక్కడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోవడంలేదని అతడు కంప్లయింట్ చేస్తున్నాడు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ హెల్మెట్ ధరించకపోతే అతడికి నష్టం కలుగొచ్చు. కానీ రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రాఫిక్ జంప్ చేస్తూ యాక్సిడెంట్లు, తీవ్ర నేరాలకు పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని మహేష్ ప్రశ్నిస్తున్నారు. గతంలో మాన్యువల్ చెకింగ్ స్థానంలో కెమెరా టెక్నాలజీతో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి ఈ-చలాన్లు పంపిస్తున్నారు. ఉల్లంఘనలు చేసేదొకరైతే.. జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది మరొకరు. ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు ఫేక్ నెంబర్ ప్లేట్లను వాడుతున్నట్టు కనిపిస్తోంది. సంఘ విద్రోహశక్తులు, నేరస్తులు ఇలా ఫేక్ నెంబర్ ప్లేట్లు వాడి నేరాలకు పాల్పడితే తామెక్కడో బలయిపోతామని వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. తన వెహికల్ నెంబర్(టీఎస్ 11ఈసీ 7058) మీద మూడు సార్లు ఫైన్ జనరేట్ చేశారని, ఫొటోల్లో ఉన్న వెహికల్ తనది కాదని నాలుగు సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా వాహనదారుడు చర్లకోల క్రిష్ణారెడ్డి ఈ నెల 21న ఫిర్యాదు చేశారు.

లాక్‌డౌన్‌లోనూ చెలగాటం

ఫేక్ నెంబర్ ప్లేట్లతో వాహనాలు వినియోగిస్తున్నవారు లాక్‌డౌన్ రోజుల్లోనూ యథేచ్ఛంగా తిరగడం గమనార్హం. మార్చి 23 నుంచి కఠిన లాక్‌డౌన్ నిబంధనలను రాష్ట్రమంతా అమలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చారని సంబంధిత పత్రాలతో పాటు వెహికల్ పత్రాలను తప్పనిసరిగా పరిశీలించారు. అయినా ఫేక్ వెహికల్ నెంబర్ ప్లేట్ వాహనదారులు రెచ్చిపోయి రోడ్లమీద తిరుగుతున్నారు. లాక్‌డౌన్ రోజుల్లో ప్రతి వెహికల్‌నూ పకడ్బందీగా చెక్ చేసే అవకాశమున్నా.. కొన్ని చోట్ల పోలీసులు నామమాత్రంగా డ్యూటీ చేశారనే అనుమానాలు వాహనదారుల్లో కలుగుతున్నారు. మహేష్ వెహికల్ నెంబర్ మీద ఏప్రిల్ 28, 29, మే3, 21న షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చలాన్లు రావడం గమనార్హం. క్రిష్టారెడ్డి వెహికల్ నెంబర్ మీద మే3, 11 తేదీల్లో చలాన్లు విధించారు. ఫొటోలు తీసి చలాన్లు జనరేట్ చేయడం వరకే పోలీసులు పరిమితమయ్యారని, ఫేక్ నెంబర్ ప్లేట్లు వాడుతున్నవారు నేరస్తులైతే తమ పరిస్థితేంటని వారు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పట్టించుకుని నకిలీ నెంబర్ ప్లేట్లను తొలగించాలని వారు కోరుతున్నారు.

సీఎం కార్ నెంబర్లు కూడా టాంపరింగ్

సాధారణ వాహనదారుల నెంబర్ ప్లేట్లనే కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్ నెంబర్ ప్లేట్లను సైతం రెండేండ్ల కింద ట్యాంపరింగ్ చేశారు. సీఎం కాన్వయ్ వెహికల్ నెంబర్ మీద ఏడాది కాలంలో ఎనిమిది చలాన్లను పోలీసులు జనరేట్ చేశారు. చాల రోజుల తర్వాత ఆ నెంబర్ సీఎం కాన్వయ్ వెహికల్ ఉందని గుర్తించిన ట్రాఫిక్ విభాగం పోలీసులు నాలుక్కరుచుకున్నారు. సీఎం వెహికల్ నెంబర్ ప్లేట్‌తో దర్జాగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా.. చలాన్లు వేసేందుకు మాత్రమే ట్రాఫిక్ సిబ్బంది పరిమితమయ్యారు తప్ప వెహికల్ ఒరిజనల్ పత్రాలను పరిశీలించలేదు. ప్రస్తుతం మళ్లీ అదే రిపీటవుతోంది. ఫేక్ నెంబర్ ప్లేట్ మీద తిరుగుతున్న వాహనానికి ఆర్టీఏ జారీచేసిన ఒరిజనల్ నెంబర్ ఏంటో తెలుసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ఆసక్తి చూపడం లేదు. కంప్లయింట్ ఇచ్చినపుడు మాత్రం చలాన్లు తొలగిస్తామని చెబుతున్నారు. పోలీసులు ఇకనైనా నకిలీ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్నవారి ఆటకట్టించాల్సిన అవసరముంది. ఫైన్లు తప్పించుకునేందుకు ఇలా ప్రయత్నిస్తున్నా.. నేరస్తులు ఇలాంటి ప్రయోగాలకు పాల్పడితే అమాయకులు అన్యాయం కాకతప్పదు.


Next Story

Most Viewed