కొత్త చరిత్ర లిఖించిన ఫ్యాషన్ డాల్.. 100 ఏళ్లుగా అదే పని

by  |
కొత్త చరిత్ర లిఖించిన ఫ్యాషన్ డాల్.. 100 ఏళ్లుగా అదే పని
X

దిశ, ఫీచర్స్: ఫ్యాషన్ రంగంలో ‘ఐరిస్ అప్‌ఫెల్’ పేరు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతోంది. అమెరికన్ వ్యాపారవేత్త, ఇంటీరియర్ డిజైనర్‌గానే రాణించిన ఆమె, ఫ్యాషన్ ఐకాన్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆగస్టు 29న 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఫ్యాషన్ డాల్, ఈ రంగంలో కొత్త చరిత్ర లిఖించింది.

ఆగస్టు 29, 1921న న్యూయార్క్‌లోని ‘ఐరిస్ బారెల్’ అనే ఒక యూదు కుటుంబంలో జన్మించింది. తండ్రి శామ్యుల్ బారెల్.. అద్దం, గాజు వ్యాపారాన్ని చేస్తుండగా, ఆమె తల్లి సద్యే.. ఫ్యాషన్ బోటిక్ నడిపేది. చిన్నతనం నుంచే ఫ్యాషన్‌పై, పాత వస్త్రాలు, వస్తువులపై మక్కువ పెంచుకుంది. ఈ క్రమంలోనే 1940 చివరలో అప్‌ఫెల్ తన కార్ల్‌ని పెళ్లి చేసుకోగా, ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘ఓల్డ్ వరల్డ్ వీవర్స్’ అనే టెక్స్‌టైల్ కంపెనీని స్థాపించారు. పాతకాలపు వస్త్రాలను పునర్నిర్మించడంలో ఈ జంట ప్రత్యేకత కలిగి ఉంది. వారు వైట్ హౌస్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారు, అక్కడ వారికి తొమ్మిది మంది అధ్యక్షులతో పని చేసే అవకాశం వచ్చింది. తన పనితీరుతో ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఫ్యాబ్రిక్’, ‘అవర్ లేడీ ఆఫ్ క్లాత్’ అనే పేరును కూడా సంపాదించుకుంది. ఈ జంట ఇంటీరియర్ డెకరేటర్‌గా.. ప్రత్యేక వస్త్రాలు, బట్టలు, గృహోపకరణాల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. 2015లో ‘ఐరిస్’ అనే డాక్యుమెంటరీ ఆమెకు మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇది ఆమె జీవితాన్ని చిత్రీకరించగా, 2018లో బొమ్మల తయారీ కంపెనీ మాట్టెల్ కూడా ఆమెకు బార్బీ డాల్ వెర్షన్‌ని తయారు చేసింది.

17, 18, 19 వ శతాబ్దాల నుంచి ఫాబ్రిక్ పునరుత్పత్తిలో నైపుణ్యం కలిగి ఉన్న అప్‌ఫెల్, న్యూయార్క్‌ మాన్‌హట్టన్‌లోని 115 ఈస్ట్ 57వ వీధిలో షోరూమ్ కూడా కలిగి ఉంది. 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఫ్యాషన్‌లో అతిపెద్ద బాధ్యత మోయాల్సి వచ్చిందని అప్‌ఫెల్ తన పుస్తకంలో చెప్పింది. 2011లో మ్యాక్ వింటర్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కోసం ఆమె లిమిటెడ్ ఎడిషన్ మేకప్ కిట్ అభివృద్ధి చేసింది. అంతేకాదు ఆ కాస్మోటిక్స్ క్యాంపెయిన్‌ ప్రచారకర్తగానూ వ్యవహరించి రికార్డ్ సృష్టించింది. 1940 ల నుండి ఫ్యాషన్ పరిశ్రమలో ‘ఐరిస్ అప్‌ఫెల్’ ఓ ఐకాన్‌గా నిలిచింది. ట్రేడ్‌మార్క్ దుస్తులు, గాజులు, ఆభరణాలు, ఆమె వ్యక్తిగత శైలి, ప్రకాశవంతమైన రంగుల వాడకం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. వయసు మీద పడుతున్నా, ఫ్యాషన్ రంగంలో ఆమె వన్నెతగ్గకుండా తన ప్రతిభను చాటుతూనే ఉంది.


Next Story

Most Viewed