పనిలేదాయే.. పైసలు కట్టమనవట్టే.. ఇప్పుడెట్టా..?

by  |
పనిలేదాయే.. పైసలు కట్టమనవట్టే.. ఇప్పుడెట్టా..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : వారంతా బడుగులు.. ఒకరు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటే.. మరోకరు టిఫిన్ బండి పెట్టుకుని బతుకీడుస్తున్నారు. ఇలా ఒకరు ఇద్దరు కాదు చాలా మంది వివిధ ఫైనాన్స్ కంపెనీల వద్ద డబ్బులు తీసుకుని ఓ ఆధారంతో జీవిస్తున్నారు. కానీ కరోనా వైరస్ వారి జీవితాలను అతలాకుతలం చేసింది. లాక్ డౌన్ కారణంగా గిరాకీ ఉండటం లేదు. కాస్త సమయం కావాలంటూ కంపెనీ వారిని బతిమిలాడుతున్నా వారు వినకుండా డబ్బులు కట్టాల్సిందేనని వేధిస్తున్నారు. డబ్బులు కట్టకుంటే బండ్లు గుంజుకుపోతున్నారు. కొందరైతే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ ఉన్నాయి.

జిల్లాలో ఫైనాన్స్ కంపెనీల నుంచి చాలా మంది రుణాలు తీసుకుని వాటితో స్వయం ఉపాధి పొందుతూ జీవితాలను నెట్టుకొస్తున్నారు.
ఒకరు ఆటో తోలుకుంటూ, మరొకరు టిఫిన్ బండ్లు నడుపుకుంటూ దాంట్లో వచ్చిన డబ్బులతో ఫైనాన్స్ చెల్లించేవారు. కానీ కరోనా వారి జీవితాలను రోడ్డుపాలు చేసింది. గిరాకీలు కాక, పైనాన్స్ డబ్బులు చెల్లించడానికి వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫైనాన్స్ డబ్బుల తీసుకునేటప్పడు చేసుకున్న ఒప్పందం ప్రకారం, రోజుకు గానీ, లేదా వారానికి గాని వాయిదా డబ్బులు కట్టాలి. అలా కట్టకుంటే వారు రోడ్లపైనే అవమానిస్తున్నారు. దీంతో చాలా మంది పరువు పోతుందని భయపడుతుంటే మరి కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు.

అధిక వడ్డీ..
చిన్న చిన్న వ్యాపారులు చేసుకునేవారు.. ఆటోలు, అద్దెకు కార్లు నడుపుకునేటోల్లు.. కిరాణ, టైలర్, బట్టలు తదితర దుకాణ దారులంతా ఫైనాన్సర్ల వద్ద అప్పులు తెచ్చి వ్యాపారాలు నడిపించుకునే వారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఫైనాన్సర్లు.. అధిక వడ్డీకి అప్పులు ఇస్తారు. నూటికి రూ.4.50 నుంచి రూ.10 వరకు వడ్డీకి వసూలు చేస్తారు. అవసరాన్ని బట్టి రేటును మారుస్తారు. ప్రైవేటు వ్యక్తులు, ఫైనాన్సర్ల వద్ద రూ.10వేలు అప్పు తీసుకుంటే.. రూ.4.50 వడ్డీ చొప్పున ప్రతి రోజూ రూ.వంద నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తుంటారు. షాపు నడిచినా..నడవకపోయినా డబ్బు మాత్రం కట్టాల్సిందే.

కరోనా సమయంలోనూ పీడింపులు
ఫైనాన్సర్ల దందా ఏండ్ల తరబడిగా సాగుతోంది. అధికారులు గానీ, ప్రభుత్వం గానీ ఏనాడూ పట్టించుకోవడం లేదు. అసలే కరోనా కావడంతో వ్యాపారాలు నడవడం లేదు.. దుకాణాలు తెరవకపోయినా తీసుకున్న పైసలు కట్టాల్సిందే అంటూ కంపెనీ వారు గొడవకు దిగుతున్నారు. మూడు నెలలు టైమ్ ఇచ్చామని.. ఇంకెంత కాలం ఆగుతామని వస్తువులు, వాహనాలను లాక్కుని పోతున్నారు. పరువు పోతున్నదని చాలా మంది తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం రుణాలు ఇచ్చి ఉంటే.. ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వేధింపులు తట్టుకోలేక
నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ పెద్దగా చదువుకోలేదు. వచ్చిన పనే చేసుకుందాం అనుకున్నాడు. ఫైనాన్స్​లో ఆటో తీసుకున్నాడు. ప్రతినెలా ఫైనాన్స్ చెల్లించేవాడు. ఇంతలోనే కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో కొద్ది రోజులు ఇంటికే పరిమితమయ్యాడు. అనంతరం సడలింపులు ఇచ్చినా ప్రయాణికులు కరువయ్యారు. ఫైనాన్స్ కంపెనీ నుంచి ఒత్తిడి ఎక్కువైపోయింది. డబ్బు చెల్లించేందుకు కాస్త సమయం కావాలని వేడుకున్నా వారు కనికరించకపోవడంతో చివరికి సూసైడ్​ నోట్​ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


Next Story

Most Viewed