రెండో పెళ్లికి అడ్డుగా ఉన్న కూతురు.. ఆ తండ్రి ఏం చేశాడంటే?

43

దిశ, నల్లగొండ: మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి సిద్ధమై, కుమార్తెను దారుణ హత్య చేసిన ఓ కిరాతక తండ్రికి జీవితఖైదు, రూ.5వేల జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా జడ్జి ఎంవీ రమేష్ మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. నల్లగొండ టూటౌన్ ఎస్ఐ డి. నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని బోయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రాంతంలో అంబూరి వెంకటేష్, అతడి భార్య పద్మ, కుమార్తె శివాణితో కలిసి నివసిస్తున్నారు. పద్మ ప్రభుత్ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తూ 2012లో మృతిచెందారు. అప్పటికే కుమార్తె శివాణి లిటిల్ ప్లవర్ స్కూల్‌లో 7వతరగతి చదువుతోంది. వెంకటేశ్ భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుని పద్మ ఉద్యోగం ఎలాగైనా పొందాలని ఆశపడ్డాడు. దీనికి కుమార్తె శివాణి అడ్డుగా ఉందని ఎలాగైనా హతమార్చాలని అనుకున్నాడు. అదే సంవత్సరంలో పాఠశాలనుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను కండువాతో మెడకు చుట్టి, గొంతునులిమి హతమార్చాడు.

ఈ ఘటనపై అప్పటి సీఐ మనోహర్ రెడ్డి నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో 302, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. కేసు విచారణ మంగళవారంతో పూర్తి కావడంతో కోర్టు కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడు వెంకటేష్ ఉద్దేశ్యపూర్వకంగానే తన కుమార్తెను హత్య చేశాడని ధృవీకరించింది. దీంతో ఆరు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు వెల్లడించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష విధించాలని జడ్జిమెంట్ ఇచ్చారు. కేసులో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జవహర్ లాల్ వాదించగా.. సమర్థవంతంగా పని చేసిన అప్పటి టూ టౌన్ ఎస్ఐ విచారణ అధికారి శ్రీనివాస్, సీఐ మనోహర్ రెడ్డి, టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ డి నర్సింహులు, కోర్టు లైజన్ ఆఫీసర్ వి. శ్రీనివాస్, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్ నరేందర్, టూ టౌన్ కోర్టు కానిస్టేబుల్ సురేష్ లను నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిని అభినందించారు.

పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు

కుమార్తెను హతమార్చిన అనంతరం వెంకటేశ్ బ్లేడుతో చేతులపై, శరీరంపై గాయాలు చేసుకుని గుర్తు తెలియని దుండుగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులను నమ్మించారు. వెంకటేశ్ తీరు, ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వెంకటేశ్ ను సమగ్రంగా విచారణ జరిపిన అనంతరం నిజం ఒప్పుకున్నాడు. దీంతో ఘటన జరిగిన కొన్ని రోజులు పోలీసులను తప్పుదొవ పట్టించినందుకు గాను ఆరు నెలల కఠిన గారాగార శిక్షను అధనంగా విధించారు

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..