పత్తి, వరి పంటలకు ఎర్రబొమ్మడి

by  |
పత్తి, వరి పంటలకు ఎర్రబొమ్మడి
X

ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికందే సమయానికి తెగుళ్ల బారిన పడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పత్తి, వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు తెగుళ్లు సోకి పూత, కాత నేలపాలవుతోంది. ఎర్రబొమ్మడి రోగం కారణంగా పత్తి, వరి చేన్లు ఎర్రగా మారిపోయి.. ఎండిపోతున్నాయి. లక్షల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే, వానలు, తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల 47 వేల 608 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో పత్తి పంట 97,839 ఎకరాల్లో పంట సాగయ్యింది. వరి పంట 39,691 ఎకరాల్లో పంట సాగు చేశారు. జిల్లా రైతాంగాం ప్రధానంగా పత్తి పంట సాగుపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. యేటా వరిపంట కంటే పత్తినే అధికంగా సాగు చేస్తుంటారు. ప్రస్తుత కూడా పత్తి పంట అధికంగా సాగయ్యింది. వానల రూపంలో పత్తి, వరి పంటలకు అపార నష్టం జరగగా, తెగుళ్ల రూపంలో మరింత నష్టం జరిగింది. పత్తి చేనులో కలుపు మొక్కలు తీసివేసేందుకు రైతులకు కూలీల భారం పడింది. అంతేకాకుండా పత్తి పంటపై ఎర్ర బొమ్మడి తెగులు దాడి చేయడంతో పూత, కాయలు రాలి, ఆకులన్నీ ఎర్ర బడిపోయాయి. దీంతో పత్తి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.

పంటలపై తెగుళ్ల దాడి

వరి పంట సాగులో సన్నకారులకు అగ్గితెగులు, కాండం తొలుచు పురుగు, సుడి దోమ, కంకినల్లి పంటలకు నష్టం కలిగించడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సిరిసిల్ల జిల్లాలో సుమారు 12 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కానీ నష్టపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవు. దీంతో రైతులు పంట నష్ట పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారు.ః

పత్తాలేని అగ్రికల్చర్ ఆఫీసర్లు..

పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించడంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పంటలకు సోకిన తెగుళ్లపై రైతులకు అవగహన, క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడంతో దిగుబడులు రాక రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. పంట నష్టం అంచనా వేసేందుకు గ్రామాలకు రాకుండానే అంచనా వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానలు, తెగుళ్లతో నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed