ఆకతాయి చేష్టలు..ఆ ఊరికి పస్తులు

by  |
ఆకతాయి చేష్టలు..ఆ ఊరికి పస్తులు
X

దిశ, కరీంనగర్ :క్వారంటైన్‌కు కరోనాకు తేడా తెలియని ఓ ప్రబుద్దుడు చేసిన పోస్టింగ్‌తో ఆ గ్రామాన్నే వెలేసినంత పని చేశారు చుట్టుపక్కల గ్రామస్తులు. ఆకతాయి చేసిన పనికి ఆ గ్రామస్తులు మూడు రోజులు పస్తులుండాల్సి వచ్చింది. కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండల తుర్కశినగర్ గ్రామస్తులు నిత్యావసరాలకు ఇరుగు పొరుగున ఉన్న గ్రామాలతోపాటు గంగాధర మండల కేంద్రానికి వెళ్తుంటారు. మూడు రోజులుగా పొరుగూరి నుంచి రావాల్సిన పాలు రావడం లేదు. నిత్యావసరాల కోసం పక్క ఊర్లకు వెళ్తే దుకాణదారులు లేవంటున్నారు. దుకాణాల్లో ఉన్నా వారికి సరుకులు ఇవ్వటానికి అనుమానపడ్డారు. నిన్నమొన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న పొరుగూరు వారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ఆరా తీశారు. చివరికి తుర్కశినగర్ వాసులకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని గుర్తించారు. దీంతో గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఇందుకు కారణమైన వ్యక్తిని పట్టుకున్నారు. మంగపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో తుర్కశినగర్ వాసులకు కరోనా వచ్చిందని తప్పుడు ప్రచారం చేసినట్టు గుర్తించారు. అతను చేసిన పోస్టింగ్ చుట్టు పక్కల ఊర్లకు పాకింది. ఈ తప్పడు ప్రచారంతో చట్టు పక్కల గ్రామస్తులు నిత్యావసరాలు రాకుండా అడ్డుకున్నారు. తప్పుడు సమాచారం షేర్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags: corona virus,karimnagar,turkashinagar,False propaganda,Someone’s arrest


Next Story