బ్రేకింగ్.. ఫేక్ ఇన్సూరెన్స్‌ ముఠా అరెస్ట్.. ముందే హెచ్చరించిన ‘దిశ’

by  |
బ్రేకింగ్.. ఫేక్ ఇన్సూరెన్స్‌ ముఠా అరెస్ట్.. ముందే హెచ్చరించిన ‘దిశ’
X

దిశ, డైనమిక్ బ్యూరో/ హన్మకొండ టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఇన్సూరెన్స్‌లు జారీ చేస్తూ వాహనదారులను మోసం చేస్తున్నారని మార్చి నెలలోనే ప్రత్యేక కథనం ‘దిశ’ పత్రికలో ప్రచురితమైంది. అయితే, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆటోలు, బైకులు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే వాహనదారులు నకిలీ బీమాలు తీసుకొని దళారుల చేతిలో మోసపోతున్నారని వరంగల్ డీటీసీ పురుషోత్తమ్ దృష్టికి ‘దిశ’ తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని వీటిని నిలువరిస్తామని ‘దిశ’తో చెప్పారు. ఈ క్రమంలో అధికారుల కళ్లు కప్పి వాహనదారులకు నకిలీ బీమాలను అందజేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. అసలైన బీమా పత్రాల వలే క్యూఆర్ కోడ్ తో పాటు యూనిక్ నెంబర్‌ను క్రియేట్ చేసి బీమాలను విక్రయిస్తున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఇలాంటి నకిలీ బీమాను పొందిన ఓ వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టురట్టైంది.

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు ప్రైవేట్ వాహన బీమా సంస్థలకు సంబంధించిన ఇన్సూరెన్స్‌‌ను రెన్యువల్ చేస్తామని నకిలీ బీమా సర్టిఫికెట్స్ అందిస్తున్నారు. ఇందుకోసం వాహనదారుల నుండి రూ. 2వేల నుంచి పదివేల రూపాయల వరకు వసూళ్ళు చేసేవారు. ఇలా వీరంతా గత కొన్ని సంవత్సరాలుగా దందా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వాహనదారుడు నిందితుల వద్ద నుంచి వాహన బీమా పాలసీ రెన్యూవల్ చేయించుకోగా.. వాహనం ప్రమాదానికి గురికావడంతో బీమా సంస్థ ద్వారా రిపేర్ చేయించుకోవాలనుకున్నాడు. వెంటనే బీమా సంస్థ ప్రతినిధిని సంప్రదించగా.. పాలసీ రెన్యువల్ కాలేదని చెప్పడంతో కంగుతిన్నాడు. మోసపోయినట్లు గుర్తించి వెంటనే ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. మిల్స్ కాలనీ పోలీసులతో కలిసి నిందితుల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించగా మోసాలు చేసినట్లు అంగీకరించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు 2వేల నుండి పదివేల మంది వాహనదారులను మోసం చేయడంతో పాటు సూమారు 90లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కోట్టారని పోలీసుల విచారణలో తెలిసింది. వీరి నుండి 4లక్షల 46వేల నగదు, 3 ల్యాప్ ట్యాప్స్, 2 డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, 5 ద్విచక్ర వాహనాలు, పది సెల్ ఫోన్లతో పాటు 433 వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, నకిలీ బీమా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో.. యం.డి షఫీ, సయ్యద్ జాహంగీర్, పెన్నల రాజేష్, పుప్పాలగుట్ట, వాంకిడి నిఖిల్, మామిడి రాజు, బి.నాగమల్లి శివకుమార్, అల్లాడి రాజేష్, గుండబోయిన శ్రీకాంత్, కేశోజు రాజ్ కుమార్, బల్లాని సమన్‌‌లు ఉన్నారు.

ఈ ముఠా సభ్యులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ టాస్క్‌ఫోర్స్ ఇంచార్జ్ వైభవ్ గైక్వాడ్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ సంతోష్, ఎస్ఐలు లవకుమార్, ప్రియదర్శిని, మిల్స్ కాలనీ పోలీసులను సీపీ తరుణ్ జోషి అభినందించారు.


Next Story

Most Viewed