విమానానికి మాస్క్.. విపత్తుకు చెక్

by  |
విమానానికి మాస్క్.. విపత్తుకు చెక్
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్ ఇంకా వీడిపోలేదు.. అప్పుడే జనాలు కరోనాకు ముందు ఉన్నట్లే గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం పరుగులు పెడుతున్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జనాలు రోడ్ల మీదకు రానప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందుకే మాస్క్ కొద్ది కాలం వరకు మన జీవితంలో భాగమైపోవాలనే ఉద్దేశంతో.. ఇండోనేషియా ఎయిర్‌‌లైన్స్ ఓ సరికొత్త ఆలోచనతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.

కరోనా వైరస్ నుంచి చాలా మందిని కాపాడిన ఆయుధాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘మాస్క్’. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మూడు పొరల మందం గల మాస్క్ వాడిన చాలా మంది కరోనా నుంచి తమను తాము రక్షించుకున్నారు. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు, అధ్యయనాలు సైతం వెల్లడించాయి. అయితే.. ఇంకా కరోనా అంకం ముగిసిపోలేదు. అసలే రాబోయేది చలికాలం ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రయాణికులు కూడా తమ ప్రయాణాల్లో మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. ఇందుకోసం అవగాహన కల్పించేలా.. ఇండోనేషియాకు చెందిన క్యారియర్ గరుడ ఇటీవలే ఐదు విమానాలకు వాటి ముందు భాగంలో.. మాస్క్‌ను తలపించేలా పెయింట్ వేయించింది. అక్కడి ప్రభుత్వం క్యాంపెయిన్ ‘లెట్స్ వేర్ మాస్క‌్’ను సపోర్ట్ చేస్తూ.. ఇలా తమ వంతు ప్రయత్నంగా గరుడ ఇండోనేషియా ఈ పని చేసింది. ఆ పెయింట్ చూస్తే.. విమానానికి కూడా మాస్క్ తొడిగారా? అనే అనుమానం కలగక మానదు. విమానంలోని ప్రయాణీకులతో పాటు ఎయిర్ ప్లేన్ క్రూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే విషయం ఈ పెయింట్ చూస్తే అర్థమవుతోంది. ఈ విమానాలు సింగపూర్ నుంచి జపాన్ మధ్య ప్రయాణిస్తుంటాయి. 60 మంది పెయింటర్లు 120 గంటలపాటు శ్రమించి విమానాలకు మాస్కు లాంటి పెయింటింగ్ వేశారు.



Next Story